9/11 దాడుల ప్రధాన సూత్రధారైన ఒసామా బిన్ లాడెన్ చాలా మంచి బాలుడని.. చిన్నప్పుడు చాలా శాంత స్వభావం కలిగి ఉండేవాడని.. అయితే చెడు మార్గంలో వెళ్లడం వల్లే తన జీవితం తలకిందులైందని ఆయన తల్లి అలియా గానెమ్ తెలిపారు. యూకేకి చెందిన ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మే 1, 2011 తేదీన అమెరికా సైన్యం జరిపిన ఒక ఆపరేషన్‌లో లాడెన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లాడెన్ మరణించి ఆరు సంవత్సరాలు అవుతున్న క్రమంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తల్లి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్నప్పుడు లాడెన్ చాలా బిడియస్తుడిగా ఉండేవాడని.. తోటి పిల్లలతో కూడా కలిసేవాడు కాదని ఆమె అన్నారు. అయితే కళాశాలలో చేరాక తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ జిజ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేస్తున్నప్పుడే లాడెన్‌కు రాడికల్ సంస్థలతో పరిచయాలు ఏర్పడ్డాయని ఆయన తల్లి అలియా అన్నారు.


"వారు నా కొడుకుని పూర్తిగా మార్చేశారు. 20 సంవత్సరాల వయసులోనే తన మనసులో విషబీజాలు నాటారు. వారి వల్ల అంత మంచి వ్యక్తి కూడా పూర్తిగా మారిపోయాడు. అలాగే తన కోసం డబ్బు కూడా విపరీతంగా ఖర్చుపెట్టారు. అలాంటి చెడ్డ వ్యక్తులతో కలిసి తిరగవద్దని నేను చాలా సార్లు చెప్పాను. తొలుత "అలాగే అమ్మా" అనేవాడు. కానీ ఆ తర్వాత ఆ విషయాలు నాతో పంచుకొనే వాడు కాదు. ఎందుకంటే నేను బాధపడతానని తనకు తెలుసు" అని అలియా తెలిపారు. 


అయితే తన కొడుకు పూర్తిగా టెర్రరిస్టుగా మారిపోతాడని తాను అనుకోలేదని అలియా అన్నారు. తాము లాడెన్‌ను ఆఖరిసారిగా 1999లో ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ ప్రాంతంలో చూశామని.. అక్కడ ఓ స్థావరంలో లాడెన్ తన అనుచరులతో నివసించేవారని ఆమె అన్నారు. తాజాగా వియాన్ (WION) వెబ్ సైట్ లాడెన్ ఫోటోలు తీసిన ప్రముఖ యూకే ఫోటోగ్రాఫర్ డేవిడ్ లెవీన్‌ను సంప్రదించింది. ఆయన కూడా లాడెన్ విషయంలో తన భావాలను పంచుకున్నారు. "లాడెన్ తల్లికి టెర్రిరిజంపై అభ్యంతరాలు ఉన్నా.. సోదరులు మాత్రం లాడెన్‌కి సపోర్టుగానే మాట్లాడేవారని" ఆయన తెలిపారు.