Breaking News: నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూను పాకిస్తాన్ వచ్చేయమన్న ఇమ్రాన్ ఖాన్ !
నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్‌లో పోటీ చేయొచ్చు : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
కర్తార్‌పూర్ / న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో కార్తాపూర్ కారిడార్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శంకుస్తాపన చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ప్రముఖ భారతీయ మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా హాజరయ్యారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా వేదికపై నుంచి అతిధులను, ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. సిద్ధూ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూని భారత్‌లో ఎందుకు విమర్శిస్తున్నారో తనకు అర్థం కావడం లేదు కానీ అతడేం తప్పు చేయడం లేదు కదా అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సిద్ధూ శాంతిస్థాపనకు కృషిచేస్తున్నారు అని సిద్ధూపై ప్రశంసలు గుప్పించిన ఇమ్రాన్ ఖాన్.. సిద్ధూ పాకిస్తాన్ వచ్చి పోటీ చేస్తే, ఆయన కచ్చితంగా గెలుస్తారని అన్నారు.
సిద్ధూ భారత ప్రధాని అయ్యేందుకు ఎంతో సమయం పట్టదని ఆశిస్తున్నాన్న ఇమ్రాన్.. సిద్ధూ భారత ప్రధాని అయ్యాకా, భారత్-పాకిస్తాన్ మధ్య శాశ్వత స్నేహబంధం చిగురిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.