పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చారు. ఇస్లామాబాద్ లోని ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలోఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ సమస్య పరిష్కారానికి తన వద్ద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నారు. శాంతియుత వాతావరణంలో ఈ ఆప్షన్స్ పై చర్చించగలుగుతామని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశరు.  ఆప్షన్స్ గురించి మీడియా ప్రశ్నించగా రెండు, మూడు ఆప్షన్స్ ఉన్నాయని మాత్రమే చెప్పిన ఇమ్రాన్ ఖాన్... వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని ప్రశ్నకు సమాధానం దాటవేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యుద్ధం జరిగితే ఇరు దేశాలకు నష్టం
కశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని అభిప్రాయపడ్డ ఇమ్రాన్ ఖాన్... చర్చలు మాత్రమే పరిష్కారాన్ని చూపుగలమని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధమే జరిగితే... ఇరు దేశాల్లో ఊహించలేని పరిణామాలు ఉంటాయని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే అణ్వస్తాలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశమే లేదని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. భారత్ లో ఎన్నికల సమయం ఆసన్నమైనందున పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా లేదని ఇమ్రాన్ తెలిపారు.


ఆర్మీ సూచనలు తీసుకుంటే తప్పేంటి ?
ఈ సందర్భంగా ఇమ్రాన్ ఆర్మీ పెత్తనంపై స్పందిస్తూ దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ఏ దేశ ప్రభుత్వమైనా వారి ఆర్మీ నుంచి సలహాలను స్వీకరించడం సహజమేనని సమర్థించుకున్నారు. తన ప్రభుత్వం, పాకిస్థాన్ ఆర్మీ రెండూ ఒకే పేజ్ పై ఉన్నాయని తన నిర్ణయాలకు ఆర్మీ మద్దతు ఉందని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు


వాజ్ పేయి మాటలను గుర్తు చేసుకున్న ఇమ్రాన్ ఖాన్
ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని వాజ్ పేయి తనతో చెప్పిన మాటలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోకపోతే కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేదని తనతో వాజ్ పేయి అన్నారని తెలిపారు. వాజ్ పేయి వ్యాఖ్యలతో చర్చల ద్వారా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నమ్మకం తనకు కలిగిందన్నారు. సమస్యను పరిష్కరించుకోవడానికి  ఇరు దేశాలు దగ్గరగా ఉన్నాయనే విషయం ఆయన మాటలతో తనకు అర్థమయిందని ఇమ్రాన్ ఖాన్  తెలిపారు.