బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. మళ్లీ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకే మద్దతు !
పుల్వామా దాడి: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను మరోసారి వెనకేసుకొచ్చిన పాకిస్తాన్ !
న్యూఢిల్లీ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను పాకిస్తాన్ మరోసారి వెనకేసుకొచ్చింది. పుల్వామా దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామంటూ గతంలోనే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించినప్పటికీ.. పాకిస్తాన్ మాత్రం తాజాగా అందుకు విరుద్ధంగా ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురెషి బీబీసితో మాట్లాడుతూ.. పుల్వామా దాడులకు తమదే బాధ్యత అని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అసలు ప్రకటించనేలేదని అన్నారు. అంతేకాకుండా భారత్‌లో జరిగే ఉగ్రవాద దాడుల వెనుక జైషే మహ్మద్ హస్తం ఉందని భారత్ నిరూపించగలిగితే, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌పై చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఖురెషి తెలిపారు.
పుల్వామా దాడులకు ప్రతీకారంగా ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ వద్ద వున్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి 350 ఉగ్రవాదులను హతమార్చామని భారత్ చేసిన ప్రకటనను సైతం ఖురెషి ఖండించారు. అసలు భారత దేశం మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఏ దేశంపైనైనా దాడులకు పాల్పడే ఉగ్రవాద శక్తులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వదని ఖురెషి అన్నారు.