Hafiz Saeed Sentenced 31 years Jail: ముంబై 26/11 పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాహ్ ఉగ్రవాద సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అలాగే రూ.3,40,000 జరిమానా విధించడంతో పాటు హఫీజ్ సయీద్ నిర్మించిన మసీదు, మదర్సాను సీజ్‌ చేయాలని ఆదేశించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చారన్న ఆరోపణలకు సంబంధించి 21/2019, 90/2019 కేసులను విచారించిన పాక్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలోనూ ఐదు కేసుల్లో హఫీజ్ సయీద్కు పాక్ కోర్టు 36 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా శిక్షతో హఫీజ్ సయీద్‌కు మొత్తం 68 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లయింది. అయితే అన్ని కేసుల్లోనూ శిక్షలు దాదాపుగా ఒకే కాలంలో అమలవుతున్నందునా... 68 సంవత్సరాల పాటు అతను జైల్లో ఉండటం కుదరదని అతని తరుపు లాయర్ పేర్కొన్నారు.


హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్య సమితి గతంలోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా హిట్ లిస్టులో ఉన్న హఫీజ్ సయీద్‌పై 10 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాడనే కారణంతో 2019లో పాకిస్తాన్‌లో హఫీజ్ అరెస్టయ్యాడు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అల్ అన్ఫాల్, దవాతుల్ ఇర్షాద్, మువాజ్ బిన్ జబల్ ట్రస్టుల ద్వారా అతను ఉగ్రవాద సంస్థలకు భారీగా ఆర్థిక వనరులు సమకూర్చాడనే ఆరోపణలున్నాయి.