భారత్‌ను సందర్శించిన బ్రిటన్ ప్రిన్స్
బ్రిటన్ యువరాజు ఛార్లెస్ దంపతులు తమ ఆసియా పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం భారతదేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. పదిరోజుల పాటు చేసే పర్యటనలో రెండు రోజులు వారు భారత్‌లో గడపనున్నారు. ఈ క్రమంలో ఛార్లెస్ దంపతులు బుధవారం సాయంత్రం ప్రధాని మోడీని గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది మార్చిలో బ్రిటన్‌లో జరగబోయే కామన్‌వెల్త్ దేశాధినేతల సమావేశం గురించి మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం భారత్, బ్రిటన్ దేశాల మధ్య 12.19 బిలియన్ డాలర్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టే అతి ముఖ్యమైన దేశాలలో భారత్ కూడా ఒకటి. అదేవిధంగా, బ్రిటన్‌కు సంబంధించి ఉద్యోగ కల్పనలో భారత్ రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం బ్రిటన్‌లో 1.5 మిలియన్ల మంది భారతీయులు పౌరసత్వం తీసుకొని నివసిస్తున్నట్లు సమాచారం . ఆ సంఖ్య ఆ దేశ జనాభాలో 1.8 శాతం అని చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్‌ను పర్యటిస్తున్న ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛార్లెస్ వెంట ఆయన సతీమణి కెమిల్లా పార్కర్ బౌల్స్ కూడా ఉన్నారు. ఈ దంపతులు భారత్ తర్వాత సింగపూర్, మలేషియా దేశాలలో కూడా పర్యటించనున్నారు.