Queen Elizabeth 2: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 కన్నుమూత.. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం..
Queen Elizabeth 2 Passes Away: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. వేసవి విడిది కోసం బల్మోరల్ ఎస్టేట్‌కు వెళ్లిన ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు.
Queen Elizabeth 2 Passes Away: బ్రిటన్ రాచరిక సామ్రాజ్యానికి 70 ఏళ్లకు పైగా మహారాణిగా వెలుగొందిన క్వీన్ ఎలిజబెత్-2 (96) కన్నుమూశారు. స్కాట్లాండ్‌లోని బల్మోరల్ ఎస్టేట్‌లో గురువారం (సెప్టెంబర్ 8) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబత్ 2 మరణాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు ధ్రువీకరించాయి. క్వీన్ ఎలిజబెత్ 2 ప్రతీ ఏటా వేసవిలో స్కాట్లాండ్‌లోని బల్మోరల్ ఎస్టేట్‌లో గడిపేందుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా బల్మోరల్ ఎస్టేట్‌కి వెళ్లిన ఆమె.. ఆరోగ్యం క్షీణించడంతో అక్కడే కన్నుమూశారు.
క్వీన్ ఎలిజబెత్ 2 గత ఏడాది కాలంగా 'ఎపిసోడిక్ మొబిలిటీ ప్రాబ్లమ్స్'తో బాధపడుతున్నట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణ వార్త తెలిసిన వెంటనే రాయల్ ఫ్యామిలీ సభ్యులంతా స్కాట్లాండ్‌లోని బల్మోరల్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. ఎలిజబెత్ 2 పార్థివ దేహాన్ని లండన్ తరలించాక వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో నాలుగు రోజుల పాటు ఉంచనున్నారు. ఆ సమయంలో సాధారణ ప్రజలకు సందర్శనార్థం అనుమతిస్తారు.క్వీన్ ఎలిజబెత్ మరణం నేపథ్యంలో బ్రిటన్‌లో 10 రోజులు సంతాప దినాలుగా పాటించనున్నారు. సోమవారం (సెప్టెంబర్ 19) క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
క్వీన్ ఎలిజబెత్ 2 ఏప్రిల్ 21, 1926న జన్మించారు. 1952లో బ్రిటన్ సామ్రాజ్య మహారాణిగా పగ్గాలు చేపట్టారు. సుదీర్ఘ కాలం బ్రిటన్ మహారాణిగా కొనసాగారు. ఎలిజబెత్ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 2015, 2018లో ఎలిజబెత్‌ను కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు. బ్రిటన్‌కు ఆమె ఒక స్పూర్తివంతమైన నాయకత్వాన్ని అందించిందన్నారు. మనకాలపు మహానేతగా ఆమెను అభివర్ణించారు. తాను ఎలిజబెత్‌ను కలిసిన ఒక సందర్భంలో మహాత్మాగాంధీ ఆమె పెళ్లి సందర్భంగా కానుకగా ఇచ్చిన హ్యాండ్ కర్చీఫ్‌ను చూపించారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎలిజబెత్ 2 మరణానికి సంతాపం తెలుపుతూ ఆమె మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు, ప్రముఖులు ఎలిజబెత్ 2 మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook