భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం పాకిస్తాన్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఒకవైపు పాకిస్తాన్ హింసను ప్రేరేపిస్తూ.. కయ్యానికి కాలు దువ్వుతుంటే.. ఇక చర్చలతో ప్రయోజనం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను విదేశాంగ శాఖకు బాధ్యతలు స్వీకరించి నాలుగు సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆమె తన ఆలోచనలను పంచుకుంటూ "వివిధ దేశాల్లో సమస్యలతో సతమతమవుతున్న దాదాపు 90,000 మంది భారతీయులకు ఈ నాలుగేళ్ళ కాలంలో విదేశాంగ శాఖ అండగా నిలిచింది. వారిని కాపాడింది. వివిధ దేశాలను సందర్శించిన భారత ప్రధాని పలు దేశాల్లో భారతీయులు కఠిన శిక్షల బారిన పడకుండా కాపాడారు. ఈ రోజు ప్రవాస భారతీయులు చాలా శాంతియుతమైన జీవితాన్ని గడుపుతున్నారు" అని ఆమె తెలిపారు.


"మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే ఐక్యరాజసమితి గుర్తించిన 192 దేశాలలోనూ పర్యటించాలని భావించాం. వాటిలో 186 దేశాలలో ఇప్పటికే పర్యటించి.. ఆ దేశాధినేతలతో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి చర్చలు జరిపాం" అని సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్ పై కూడా సుష్మా స్వరాజ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.


తాము పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ముందుగా ఆ దేశం తీవ్రవాదులను ప్రోత్సహించడం మానేయాలని అన్నారు. "చర్చలు, హింస అనేవి ఒకే దారిలో పయనించవు. కానీ.. హింసకు దారితీస్తున్న పరిస్థితులపై ప్రతీఒక్కరం చర్చించాలి" అని ఆమె అన్నారు. "గిల్గిత్ బల్తిస్తాన్ ఆర్డర్ విషయంలో పాకిస్తాన్ భారతదేశానికే చరిత్ర పాఠాలు బోధించాలని భావిస్తోంది. కానీ చరిత్రను వక్రీకరించడంతో పాటు చట్టాన్ని గౌరవించకపోవడం అనేది పాకిస్తాన్ ఎప్పుడూ చేసే పనే" అని సుష్మా అన్నారు.