శ్రీలంక నేవీ అధికారులు 12 మంది తమిళనాడు జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు తీర ప్రాంతంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి చేపలవేటకు వచ్చిన వారిని అరెస్టు చేసి వారి బోట్లను గురువారం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 3000 మంది జాలర్లు చేపల వేటకు వచ్చారని తమకు సమాచారం అందిందని..  కరైననగర్ ప్రాంతంలోకి వచ్చే సముద్ర భూభాగంలోకి వారు అక్రమంగా చొచ్చుకు వచ్చారని.. అందుకే వారిని రౌండప్ చేశామని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సాధ్యమైనంత మంది జాలర్లు తప్పించుకొని వెళ్లిపోయారని.. ప్రస్తుతం తమ టీమ్ 12 మంది జాలర్లను అరెస్టు చేసి ప్రశ్నిస్తోందని శ్రీలంక నేవీ అధికారులు అక్కడ మీడియాకి తెలియజేశారు. ప్రస్తుతం ఆ జాలర్లను కంగేశన్ తురాయ్ పోర్టు ప్రాంతంలో నిర్భందించినట్లు సమాచారం. ఆ జాలర్లపై ఇతర దేశ సముద్రభాగంలోకి వచ్చి నిషేధిత ప్రాంతంలో చేపలు పడుతున్నట్లు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 


గతంలో కూడా తమిళనాడు జాలర్లపై ఇలాంటి కేసులే శ్రీలంక నేవీ అధికారులు నమోదు చేశారు. 2017లో కూడా ఓసారి ధనుష్కోటి సమీపంలో సముద్రంలో నాటుపడవలతో చేపలవేట సాగిస్తున్న రామేశ్వరం జాలర్లపై శ్రీలంక నేవీ అధికారులు దాడి చేశారు. మార్చి 2017లో  భారత్‌, శ్రీలంక ప్రభుత్వాల మధ్య కొలంబోలో జరిగిన చర్చల అనంతరం 77 మంది తమిళనాడు, 12 మంది శ్రీలంక మత్స్యకారులకు విముక్తి లభించింది. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరగడం సాధారణమైపోయింది.