ఉగ్రదాడులకు కారణాన్ని వెల్లడించిన శ్రీలంక సర్కార్
ఉగ్రదాడులపై శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది
శ్రీలంకలో ఉగ్రమూకలు రెచ్చిపోయి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పవిత్ర ఈస్టర్ రోజున ప్రసిద్ధ చర్చిలు, విదేశీయులు ఎక్కువగా ఉండే స్టార్ హోటళ్లను లక్ష్యంగా ఉగ్రమూమల జరిపిన ఈ భీభత్సవంలో 321 మంది అమాయకులు బలయ్యారు. కాగా ఈ దాడిలో 500 మందికిపైగా గాయాలపాలైయ్యారు. నరమేధం సృష్టించిన ఈ దాడి వ్యవహారంపై విచారణ జరిపేందుకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రత్యేక కమిటీని నియమించారు. ఘటనపై విచారణ జరిపిన కమిటీ తన ప్రాధమిక రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది
దాడికి కారణం ఇదే...
తాజా ఘటనపై విచారణ జరిపిన ఈ కమిటీ...న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చిలో రెండు మసీదులపై జరిగిన దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలో చర్చీలు, స్టార్ హోటళ్లను ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకున్నాయని ప్రాథమికంగా నిర్ధారించింది . ఈ విషయాన్ని ఆ దేశ రక్షణశాఖ సహాయ మంత్రి రువన్ వజవర్ధన్ పార్లమెంటుకు తెలిపారు. న్యూజిలాండ్ లో ఈ ఏడాది మార్చి 15న క్రైస్ట్ చర్చ్ లో ఉన్న రెండు మసీదులపై శ్వేతజాతి క్రైస్తవ మతస్తుడు అయిన బ్రెంటన్ టర్రంట్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రార్థనలు చేసుకుంటున్న 50 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగానే ఉగ్రమూకలు శ్రీలంకలో ఈస్టర్ రోజున అమాయకులను లక్ష్యంగా తీసుకున్నట్లు శ్రీలంక ప్రభుత్వం నిర్ధారించింది.
దాడులు చేసిందెవరు ?
స్థానిక తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ దాడుల వెనుక ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ధారించింది. అయితే ఈ సంస్థకు ఐసీఎస్ లాంటి విదేశీ ఉగ్రసంస్థల నుంచి సాయం అందిందా ? అనే కోణంలో విచారణ సాగుతోంది. కాగా ఏడుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన నేపథ్యంలో వారితో సంబంధమున్న 40 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని నిజాలు వెలుగులోకి రానున్నాయి.