న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లా అవంతిపురలో గురువారం జరిగిన ఉగ్రదాడిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. భారత భూభాగంపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా అమెరికా పాక్‌ని హెచ్చరించింది. పాక్ భూభాగంపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఇకనైనా మానుకోవాల్సిందిగా అమెరికా పాక్ కి సూచించింది. అవంతిపురలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడికి తామే బాధ్యులమని పాక్ కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా వైట్ హౌజ్ నుంచి మీడియా కార్యదర్శి సారా శాండర్స్ గురువారం రాత్రి ఈ ప్రకటన విడుదల చేశారు. 


భారత్‌లో భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడి కారణంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న తమ లక్ష్యాన్ని, పరస్పర సహకార బంధం మరింత బలోపేతమైందని అమెరికా వైట్ హౌజ్ వర్గాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.