టీవీ చానెళ్లలో మహిళలు నటించే షోలపై నిషేధం... మీడియాకు తాలిబన్ సర్కార్ కొత్త రూల్స్..
Taliban New Rules: ఆఫ్గనిస్తాన్‌లో మహిళలను పూర్తిగా అణచివేసే దిశగా తాలిబన్లు ఒక్కో చర్యకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా ఆఫ్గన్ టీవీ చానెళ్లలో మహిళా నటులు కనిపించే షోలపై నిషేధం విధించారు. మహిళా జర్నలిస్టులు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని హుకుం జారీ చేశారు.
Taliban New Rules: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు మహిళల పట్ల ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. ఆఫ్గన్‌ను (Afghanistan) తమ హస్తగతం చేసుకున్నాక ఏర్పాటు చేసిన మొదటి ప్రెస్ మీట్‌లో మహిళా హక్కులపై ఉదారంగా మాట్లాడిన తాలిబన్లు... ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అక్కడి టెలివిజన్ చానెళ్లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన తాలిబన్లు (Taliban)... మహిళా నటులు కనిపించే టీ షోలు, ఈవెంట్స్, డ్రామాలపై నిషేధం ప్రకటించారు. అలాగే న్యూస్ చానెళ్లలో పనిచేసే మహిళా జర్నలిస్టులు రిపోర్టింగ్ సమయంలో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని హుకుం జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
టీవీ చానెళ్లలో మహమ్మద్ ప్రవక్తతో పాటు ఇతర మత ప్రముఖుల చిత్రాలను చూపించే కార్యక్రమాలను కూడా ప్రసారం చేయవద్దని తాలిబన్ (Taliban) ప్రభుత్వం మీడియాను ఆదేశించింది. 2001లో ఆఫ్గనిస్తాన్‌లో (Afghanistan) తాలిబన్ల పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడి మహిళలకు అన్ని హక్కులు లభించాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో పురుషులతో సమానంగా వారు అన్ని హక్కులు పొందారు. అటు మీడియా రంగం కూడా విస్తరించింది. కొత్తగా ఎన్నో టీవీ చానెళ్లు, రేడియో స్టేషన్లు పుట్టుకొచ్చాయి. ఆఫ్గన్ ఇప్పుడు మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో మహిళలు, మీడియా హక్కులను వారు కాలరాస్తున్నారు.
నిజానికి విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళా హక్కులను గౌరవిస్తామని మొదట్లో తాలిబన్లు ప్రకటించారు. ఈసారి తాలిబన్ పాలన (Islamic Emirates of Afghanistan) గతానికి కంటే భిన్నంగా ఉంటుందని చెప్పారు. కానీ తాలిబన్ల నిర్ణయాలు వారి హామీల్లో డొల్లతనాన్ని బయటపెడుతూనే ఉన్నాయి. ఆఫ్గన్‌ను హస్తగతం చేసుకోవడమే ఆలస్యం.. పలువురు మహిళా జర్నలిస్టులను బలవంతంగా తమ కార్యాలయాల నుంచి ఇళ్లకు పంపించేశారు. మళ్లీ ఉద్యోగాలకు వెళ్తే చంపేస్తామని హెచ్చరించారు. తాలిబన్ల ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్క మహిళకూ స్థానం కల్పించలేదు. దీనిపై పదుల సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపినా పట్టించుకోలేదు. ఇక బాలుర పాఠశాలల రీఓపెనింగ్‌కు అనుమితినిచ్చిన తాలిబన్ సర్కార్... బాలికల స్కూళ్లను విస్మరించింది. తద్వారా స్త్రీ విద్యకు తాము వ్యతిరేకమనే సంకేతాలు పంపకనే పంపింది.
Also Read: పాకిస్తాన్ విమానాన్ని కూల్చిన కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు ‘వీర్ చక్ర’ పురస్కారం
ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాబూల్ (Kabul) మేయర్ మహిళా ఉద్యోగులు ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. కేవలం పురుషులతో భర్తీ చేయలేని ఉద్యోగాల్లో మాత్రమే మహిళలకు పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఆఫ్గన్ వాసులకు 1996-2001 మధ్య సాగిన తాలిబన్ల అరాచక పాలన గర్తుకొస్తోంది. అప్పట్లో స్త్రీ విద్యపై నిషేధం విధించిన తాలిబన్లు... బాలికలు చదువుకునే స్కూళ్లను మూసివేయించారు. మగ తోడు లేకుండా స్త్రీలు బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు. ఒకవేళ పరాయి వ్యక్తితో బయట కనిపిస్తే దారుణ శిక్షలు విధించేవారు. అక్రమ సంబంధాల ఆరోపణల్లో బహిరంగ శిరచ్చేదనం వంటి కఠిన శిక్షలు అమలుచేసేవారు. ప్రస్తుతం తాలిబన్లు (Taliban) ఒక్కొక్కటిగా అమలుచేస్తున్న అణచివేత చర్యలకు అక్కడి మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 1996లో తాలిబన్లు అమలుచేసిన అణచివేత చర్యలన్నీ మళ్లీ అమలుచేస్తారేమోనని భయం భయంగా గడుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook