ఫ్లోరిడా స్కూల్ ఉదంతం తరువాత.. అమెరికా ప్రభుత్వం తెరపైకి కొత్త ఆలోచన తీసుకొచ్చింది. స్కూళ్లల్లో మారణహోమం పునరావృతం కాకుండా ఉండేందుకు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు తుపాకులు ఇవ్వాలని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారని స్థానిక పత్రికలలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నట్లు కూడా అందులో పేర్కొన్నాయి.  


దేశవ్యాప్తంగా దాదాపు ఒక మిలియన్ మంది టీచర్లకు ఆయుధాలు అందించి, వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకుగానూ ట్రంప్ సర్కార్ నిధులు సమీకరించే అవకాశముందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. తుపాకులను కలిగి ఉన్న టీచర్లకు రూ.67 వేల చొప్పున బోనస్‌ ఇస్తే, మిలియన్ మందికిగానూ రూ.6,700 కోట్లు ఖర్చువుతాయని పేర్కొంది. పాఠశాలల భద్రత కోణంలో చూస్తే అది అంత పెద్ద ఖర్చేమీ కాదని కూడా అభిప్రాయం వెల్లడించింది. ఈ విషయంపై ట్రంప్ త్వరలోనే కాంగ్రెస్‌ సభ్యులతో మాట్లాడుతారని తెలిపాయి. పాఠశాలల భద్రతపై శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ ఆలోచనను అధికారులకు చెప్పినట్లు సమాచారం.