'కరోనా వైరస్'పై అమెరికా యుద్ధం ప్రకటించింది. మహమ్మారిని ఎదుర్కునేందుకు ఇప్పటి వరకు ఏ  దేశం చేయని విధంగా పౌరులకు పరీక్షలు నిర్వహిస్తోంది. చైనా, ఇటలీని మించిన కేసులు అమెరికాలో  నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే హెల్త్ ఎమెర్జెన్సీ విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. పౌరులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.దీంతో అమెరికా వైద్య సిబ్బంది.. ఇప్పటి వరకు 10  లక్షల మందికి కరోనా వైరస్  పరీక్షలు  నిర్వహించారు. ఈ విషయాన్ని స్వయంగా డోనాల్డ్ ట్రంప్ ... వైట్ హౌస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు మరింత పకడ్బందీగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. 


10 లక్షల మందికి ఇలా పరీక్షలు చేయడం అమెరికా చరిత్రలో  ఇదే తొలిసారి   కావడం విశేషం. ధైర్యంగా కరోనా వైరస్ ను ఎదుర్కుందామని అధ్యక్షుడు ట్రంప్  పిలుపునిచ్చారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎవరి పాత్ర వారు పోషించాలని కోరారు.పౌరులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని తెలిపారు.



రాబోయే 30  రోజులు చాలా కీలకమని ట్రంప్ అన్నారు. సాధారణ రోజులు రావడానికి కనీసం 30 రోజులు పడుతుందని వెల్లడించారు.అప్పటి వరకు శక్తిమంతంగా కరోనా వైరస్ ను ఎదుర్కుందామని సూచించారు.


మరోవైపు అగ్రరాజ్యాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటి వరకు లక్షా 63 వేల 807 కరోనా పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. 2 వేల 828 మంది కరోనా దెబ్బకు బలయ్యారు. అటు ప్రపంచవ్యాప్తంగా 37 వేల 638 మంది మృతి చెందగా...  7 లక్షల 84 వేల 314 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.