ఇండియా అంటే తనకెంతో ఇష్టమని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల సమస్యకు పరిష్కారాల కోసం సోమవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఓ సదస్సు నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఈ కీలక సదస్సు జరిగింది. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సదస్సు తర్వాత ఐరాసలో సుష్మా ట్రంప్‌ను పలకరించారు. ఆమెతో ట్రంప్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీ పంపిన సందేశాన్ని తెలిపారు. వెంటనే సుష్మాతో ట్రంప్‌ ‘భారత్‌ అంటే నాకెంతో ఇష్టం. నా మిత్రుడు ప్రధాని మోదీని అడిగానని చెప్పండి' అని అన్నారు. ఈ సమయంలో అక్కడ ట్రంప్ వెంట అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఉన్నారు.


మాదక ద్రవ్యాలను సరఫరా చేసే మాఫియాలను అణిచివేద్దామని, డ్రగ్స్ బానిసలకు విముక్తి కలిగిద్దామని డొనాల్డ్ ట్రంప్ 'మాదక ద్రవ్యాల నియంత్రణ' సదస్సు ద్వారా పిలుపునిచ్చారు. ఉమ్మడి పోరాటంతోనే ఇది సాధ్యమని నొక్కి చెప్పారు. కాగా ఐరాసలో జరిగిన ఈ కీలక సదస్సుకు భారత్ సహా 130 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మత్తు బానిసలుగా మారి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిందని, మత్తు మహమ్మారిని ఆనవాళ్లు లేకుండా పెకిలించి వేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.