ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సి)లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించడానికి అమెరికా మద్దతు ఇస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రపంచ భాగస్వాములైన ఈ రెండు దేశాలు అణ్వస్త్రాల నిరాయుధీకరణ తదితర వివిధ ప్రపంచ సవాళ్లపై కలిసి పనిచేయాలనే నిబద్ధతతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐక్యరాజ్యసమితి 73వ సర్వసభ్య సమావేశాలు ప్రారంభమైన మొదటి వారంలో భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలేను అమెరికా రాజకీయ వ్యవహారాల సహాయ కార్యదర్శి డేవిడ్ హేలే కలిసినట్లు దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతం యొక్క బ్యూరో ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ ఆలిస్ వెల్స్ చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని.. అమెరికా, భారత్‌కు చెందిన వివిధ విభాగాల అధికారుల మధ్య ఇప్పటివరకు అనేకసార్లు చర్చలు జరిగాయని తెలిపారు.


భారత్, అమెరికా మధ్య సహకారం మరింత బలోపేతం చేసుకోవడానికి ఇటీవలే ఇరుదేశాలు 2+2 చర్చల్ని ప్రారంభించారు. ఢిల్లీ వేదికగా వ్యూహాత్మక, భద్రత, రక్షణ సహకారాలను బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో  భారత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్..  విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, మైక్ పాంపెయో పాల్గొన్నారు.


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు తెలుపుతోందని అమెరికన్ దౌత్యవేత్త అన్నారు.


కాగా.. న్యూయార్క్‌లో జరిగిన 2+2 సమావేశం న్యూఢిల్లీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా తెలుస్తోంది.


భారత్ పర్యటనకు ట్రంప్ ఆసక్తి


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. తగిన సమయంలోనే భారత్‌ను సందర్శించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోందని దక్షిణ, మధ్య ఆసియా ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఆలిస్ వెల్స్ మీడియా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ట్రంప్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై శ్వేతసౌధం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.