భారత్‌కు తిరిగిరానున్న విజయ్ మాల్యా!
భారత్‌కు విజయ్ మాల్యా తిరిగిరానున్నారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
భారత్‌కు విజయ్ మాల్యా తిరిగిరానున్నారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచివెళ్లిన విజయ్ మాల్యా తిరిగి భారత్‌కు రానున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భావిస్తున్నారు. గత నెలలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అతడిని పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించాలని, 12,500కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
మంగళవారం విజయ్ మాల్యా మాట్లాడుతూ, తానూ చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్నానని చెప్పారు. ఇదివరకే తాను అప్పులను తిరిగి చెల్లిస్తానని, తనకు అవకాశమివ్వాలని ఏప్రిల్ 15,2016లో మోదీకి, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. 13,900 కోట్ల రూపాయల విలువైన తన ఆస్తులను విక్రయించాలని కర్నాటక హైకోర్టుకు కోరానని బుధవారం ట్విట్టర్‌లో మాల్యా పేర్కొన్నారు.
బ్యాంకుల రుణాలను తిరిగి చెల్లించకుండా, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. లండన్ కోర్టులో కూడా మాల్యాను అప్పగించాలని భారత్ న్యాయపోరాటం చేస్తోంది. అదీగాక కేంద్రం ఇటీవలే పరారీ ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్సును జారీ చేసింది. దీంతో దేశ, విదేశాల్లో మాల్యాకు చెందిన ఆస్తులను వెంటనే జప్తు చేసే అధికారాలు ప్రభుత్వానికి వచ్చాయి. ఈ చర్యలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న మాల్యా.. భారత్‌లో న్యాయ విచారణకు సహకరించేందుకు సిద్ధమేనని, భారత్‌కు తిరిగివస్తానన్న సంకేతాలను అధికార వర్గాలకు పంపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు స్పష్టతనివ్వడం లేదు.