ప్రపంచంలోనే తొలిసారిగా న్యూస్ చదివే రోబోట్‌ని తయారుచేశారు చైనా శాస్త్రవేత్తలు. ఇది ప్రపంచంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ అని పేర్కొన్నారు. చైనా సెర్చింజన్ కంపెనీ సోగో, చైనా న్యూస్ ఏజెన్సీ గ్జినువా సంయుక్తంగా ఈ రోబోట్‌కి రూపకల్పన చేశారు. బుధవారం చైనాలో ఈ రోబోట్‌ని అధికారికంగా సేవలందించేందుకు ఆహ్వానించారు. పూర్తిగా మనిషి ఆకారంలో ఉన్న ఈ రోబోట్ కెమెరాకి ఫోజ్ ఇస్తూ.. కావాల్సినప్పుడల్లా హావభావాలు ప్రకటిస్తూ.. న్యూస్ చదివి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. చైనాలో ప్రముఖ న్యూస్ యాంకర్ జాంగ్ జావో రూపురేఖలతో ఈ రోబోట్‌ని రూపకల్పన చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తూ.. మీడియా రంగంలోకి కూడా కొత్త సాంకేతిక పద్ధతులకు శ్రీకారం చుట్టాలని భావించే ఈ రోబోట్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఈ రోబోట్ వినే టెక్స్ట్ రాయడమే కాకుండా.. రాసిన టెక్స్ట్‌ను చదువుతుంది కూడా. ఇదే దీని ప్రత్యేకత. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచి ఇవ్వడం కోసం ఈ ప్రయోగం" అని చైనా న్యూస్ ఏజెన్సీ గ్జినువా ప్రతినిధులు తెలిపారు. 


అచ్చం మనిషిలాగే కనిపించే ఈ రోబోట్ న్యూస్ రీడర్ చదివిన వార్తలకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా అభిమానులు కూడా ఏర్పడ్డారట. అయితే నేచురల్‌గా చదివే వార్తలకీ.. ఈ రోబోట్ చదివే వార్తలకీ వ్యత్యాసం ఉందని.. ఈ ప్రయోగం కొన్నాళ్లు బాగా నడిచినా సరే.. ఆఖరికి సంప్రదాయ ప్రేక్షకులు ఒరిజినల్ న్యూస్ రీడర్స్ వైపే మొగ్గు చూపుతారని పలువురు అంటున్నారు. వాయిస్ సిమ్యులేషన్, మానిరిజమ్ క్యాప్చురింగ్, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ మొదలైన విషయాల్లో ఈ రోబోట్‌ 100 శాతం ఫలితం ఇవ్వడానికి కారణం.. పలు సాఫ్ట్ వేర్లను అనుసంధానం చేసి ఈ రోబోట్‌ను రూపొందించడమే అని గ్జినువా న్యూస్ ఏజెన్సీ వారు తెలియజేయడం గమనార్హం.