మోదీ కోసం పెళ్లిళ్ల పేరయ్య అవుతానన్నారట ట్రంప్!
మోదీ కోసం పెళ్లిళ్ల పేరయ్య అవుతానన్నారట ట్రంప్!
మోదీకి సంబంధం చూస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్ చేశారని అమెరికా మీడియా ఔట్ లెట్ పొలిటికో 'దౌత్యపరమైన తప్పిదాలు' అనే పేరిట ప్రచురితమైన ఓ కథనంలో పేర్కొంది. వేర్వేరు దేశాధినేతలతో సమావేశమైనప్పుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తప్పిదాలు, టెలిఫోన్ సంభాషణల్లో చేసిన పొరపాట్లు, ఉచ్చారణ లోపాలు, ఇబ్బందికర వ్యాఖ్యల గురించి రాశారు. నేపాల్ ను 'నిప్పుల్' అని, భూటాన్ 'బటన్' అని ఉచ్ఛరించారని పేర్కొంది. అలాగే.. గతేడాది మోదీ అమెరికా పర్యటన సమయంలో వైట్ హౌస్‌లో అధికారులతో మాట్లాడిన ట్రంప్.. మోదీ భార్యతో కలిసి ఉండటం లేదననే విషయం తెలుసుకొని.. మోదీకి సంబంధం చూస్తానంటూ అన్నారట.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, ఆర్థిక సహకారాలను బలోపేతం చేసుకోవడం కోసం.. మూడు దేశాల పర్యటనలో భాగంగా జూన్ 2017న అమెరికాకు వెళ్లారు. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలిసారి మోదీ భేటీ అయ్యారు.
అటు భారత ప్రభుత్వం 2019 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించగా..ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ట్రంప్ ఓ నిర్ణయానికి వస్తారని వైట్ హౌస్ తెలిపింది. ‘రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానం అందింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్ మీడియాకు చెప్పారు. త్వరలో అమెరికా-భారత్ మధ్య 2+2 వ్యూహాత్మక చర్చలు జరుగుతాయని, ఆ తర్వాతే ట్రంప్ భారత పర్యటనపై ఓ నిర్ణయానికి వస్తారని తెలిపారు.