అలాంటి వీడియోలు పోస్ట్ చేయవద్దు: YouTube
సోషల్ మీడియాలో కూడా విశ్వసనీయత పెరగాలని ఫేస్ బుక్, యూట్యూబ్ భావిస్తున్నాయి. ఈ మేరకు ఆ సంస్థలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
వాషింగ్టన్: ఈ ఆధునిక కాలంలో స్వీయ ప్రయోజనాల కోసం విశ్వసనీయత, విలువలకు నీళ్లొదిలి తప్పుడు విషయాలను ప్రచారం చేయడం ఎక్కువైంది. ముఖ్యంగా ఎన్నికలు లాంటి కీలక అంశాలలో నిజాలేంటన్నది ప్రజలకు తెలియాలి. కానీ రాజకీయ పార్టీలుగానీ, వారికి ప్రచారం కల్పిసంచే సంస్థలు కానీ తమకు తోచిన విధంగా డేటాను అప్ డేట్ చేస్తుంటాయి. అయితే ఇకనుంచి నిరాధార వార్తలను అరికట్టేందుకు తాము చర్యలు తీసుకున్నామని సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికలు, ఎన్నికల అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలు, ఇతరత్రా తేదీల విషయాలపై నిఘా పెంచుతామని.. తప్పుడు సమాచారమని తేలితే యూట్యూబ్ నుంచి కచ్చితంగా తొలగిస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇలాంటి సమాచారం కనిపెట్టేందుకు యూట్యూట్ ప్రత్యేకంగా నియమించిన ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ సభ్యులు వీడియోలపై ఎల్లప్పుడూ నిఘా ఉంచుతారు. సమాజానికి అవసరమైన, శ్రేయస్కరమైన విషయాలతో పాటు వాస్తవాలను మాత్రమే తెలపడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ విభాగం ఉపాధ్యక్షుడు లెస్లీ మిల్లర్ తెలిపారు. మతానికి సంబంధించి తప్పుడు విషయాలు పోస్ట్ చేసినా, విధ్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోలను డిలీట్ చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టెక్నాలజీ సాయంతో విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నట్లు ఉండే వీడియోలను తొలగించేందుకు ఇదివరకే ఫేస్ బుక్ నడుం బిగించింది. అలాంటి వీడియోలను గుర్తిస్తే తక్షణమే డిలీజ్ చేస్తామని ప్రకటించించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను నిషేధించేందుకు ట్విట్టర్ సైతం నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోలలో విశ్వసనీయత పెరగాలని, నెటిజన్లకు ఎలాంటి అనుమానాలకు తావివ్వని కంటెంట్ అందించాలన్నదే తమ లక్ష్యమని యూట్యూబ్, ఫేస్ బుక్ చెబుతున్నాయి.