ఏపీలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి
డిగ్రీ పూర్తి చేసిన వారినే అర్హులుగా గుర్తించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించిందన్నారు.
అమరావతి: ఏపీలో 10లక్షల మందికి నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ నెలాఖరులో విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతి అమలు చేస్తామని, కనీసం 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని భావిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించామన్నారు.
గురువారం నిరుద్యోగ భృతిపై మంత్రివర్గ ఉపసంఘ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వయోపరిమితి, విద్యార్హత, విధివిధానాలపై చర్చించామన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడమే కాకుండా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని, నైపుణ్య శిక్షణ పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీ వేస్తామని పేర్కొన్నారు.
డిగ్రీ పూర్తి చేసిన వారినే అర్హులుగా గుర్తించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించిందన్నారు. కుటుంబంలో ఒక్కరికే నిరుద్యోగ భృతిని అందిస్తామని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. భృతిని ఇచ్చేవారికి పలురంగల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాక.. భృతి నుంచి మినహాయిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు.