2017 సంవత్సరం.. తెలుగు సాహిత్య వికాసానికి ఒకింత దోహదపడిందనే చెప్పవచ్చు. అందుకు పలు కారణాలూ ఉన్నాయి. సాధారణంగా సాహితీ లోకంలోకి కొత్త కథకులు వస్తున్నా.. కొత్త తరం పాఠకులు చదివే సాహిత్యం ఎంతవరకు వస్తుందనే విషయం ఎప్పటికీ ప్రశ్నార్థకమే. ఇబ్బడిముబ్బడిగా అనేక నవలలు, కవితా సంపుటాలు, కథా సంపుటాలు ప్రతీ నెలా తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే ఏవి ఎంతవరకు పాఠకాదరణ పొందాయి.. పునర్ముద్రణకు నోచుకున్నాయి అన్న విషయం పక్కన పెడితే సాహిత్యమనేది మానవ జీవితం నుండి దూరం కాలేదన్నది మాత్రం వాస్తవం. నిత్యం ఏదో ఒక సాహితీ సభ జరగడం, వాటికి సంబంధించిన వార్తలు పత్రికల్లో రావడం ఈ రోజు పరిపాటి. అయితే  సాహిత్యం పెద్ద రచయితలకు మాత్రమే పరిమితమా.. యువత సాహిత్యం చదువుతున్నారా.. రాస్తున్నారా లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు మాత్రం ఎవరైనా ఆలోచనలో పడతారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో 2017 సంవత్సరంలో తెలుగు సాహితీ లోకంలో జరిగిన పలు విశేషాలను మనం కూడా అవలోకనం చేసుకుందాం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో సాహిత్య జల్లులు
సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ఏడాది ఎందరో యువ కవులు, రచయితలు తెలుగు సాహితీ లోకానికి పరిచయం కావడం విశేషం. సామాజిక అనుసంధాన వేదికల ద్వారా, బ్లాగుల ద్వారా కూడా తమకు తోచిన సాహిత్యం రాస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నవారు కూడా ఎందరో ఉన్నారు. ప్రతిలిపి, కహానియా, సుకథ లాంటి ఆన్‌లైన్ సంస్థలు యువ రచయితల కథలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ.. ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయి. బ్లాగులోకంలోకి కూడా కొత్త బ్లాగర్లెందరో అడుగుపెట్టారు. కవిసంగమం లాంటి గ్రూపులు యువకవులను ప్రోత్సహిస్తూ.. వారి సాహిత్యాన్ని కూడా అందరికీ ఆన్‌లైన్ వేదికల ద్వారా పరిచయం చేస్తున్నాయి. తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే ఔత్సాహికులు వాట్సప్ ద్వారా తమ సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. అంతకు మించి వికిపీడియాలో కూడా అన్ని అంశాల్లాగే తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు విరివిగా ప్రచురితమవడం, వికీబుక్స్‌లో తెలుగు సాహిత్యానికి చెందిన అనేక పుస్తకాలు అందుబాటులోకి రావడం ఆశాజనకమైన పరిణామమే. 


అక్షర సేద్యానికి దక్కిన పురస్కార మాలికలు..!
ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమి అందించే అత్యుత్తమ పురస్కారం ప్రముఖ కవి దేవిప్రియ రచించిన 'గాలిరంగు' కవితా సంపుటికి లభించింది. అలాగే యువ సాహిత్య పురస్కారం రచయిత్రి  మెర్సీ మార్గరెట్ రచించిన 'మాటల మడుగు' కవితా సంపుటికి లభించింది. అలాగే అనువాద విభాగంలో వీణా వల్లభరావు రచించిన ‘వీరామమెరుగని పయనం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. పంజాబ్‌‌కు చెందిన ఖానాబదాష్ ఆత్మకథను వల్లభరావు తెలుగులోకి అనువదించారు. అదే విధంగా బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన జగిత్యాల వాస్తవ్యులు, రచయిత వాసాల నర్సయ్యకు బాలసాహిత్య అవార్డును అకాడమి ప్రకటించింది. ఇక తానా నిర్వహించిన నవలల పోటీల్లో శప్తభూమి (బండి నారాయణస్వామి), నీల (కె.ఎన్.మల్లీశ్వరి), ఒంటరి (సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి) నవలలు ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచాయి.  


సుద్దాల ఫౌండేషన్ ప్రకటించే “సుద్దాల హనుమంతు-జానకమ్మ” జాతీయ పురస్కారం సినీ రచయిత గోరేటి వెంకన్నను వరించింది. అదేవిధంగా రావిశాస్త్రి లిటరరీ ట్రస్టు అందించే రావిశాస్త్రి అవార్డును ప్రముఖ రచయిత తల్లావఝల పతంజలి శాస్త్రి అందుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా రచయితల సంఘం అందించే ఆలూరి బైరాగి సాహితీ పురస్కారం-2017 రచయిత ఆర్‌ఎం ఉమామహేశ్వరరావును వరించింది. గిడుగు రామమూర్తి ఫౌండేషన్ అందించే గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారంను రచయిత జియో లక్ష్మణ్ పొందగా.. దివాకర్ల మెమోరియల్ ట్రస్టు అందించే దివాకర్ల వెంకటవధాని పురస్కారం ఆచార్య ఎస్వీ సత్యనారాయణను వరించింది. అలాగే కవి యాకూబ్ అందించే రొట్టమాకు రేవు కవితా పురస్కారాలు అబ్దుల్ వాహెద్ (ధూళిచెట్టు కవితా సంపుటి), అనిశెట్టి రజిత (నిర్భయాకాశం కింద - కవితా సంపుటి), సిద్ధార్థ (బొమ్మల బాయి - కవితా సంపుటి)లకు లభించాయి.


విశాఖపట్నం నుండి మొజాయిక్ సాహిత్య సంస్థ అందించే అక్షర గోదావరి పురస్కారాలు 2017కి గాను ద్వానా శాస్త్రి, వేంపల్లి షరీఫ్, పి.అనంతరావు, ఎవిఆర్ మూర్తిలను వరించాయి. ఇతర పురస్కారాల విషయానికి వస్తే పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారంను మహ్మద్‌ ఖదీర్‌బాబు, రచయిత్రి డి.సుజాతాదేవి పొందగా, జానమద్ది సాహితీ పురస్కారం (కోరుకొండ బుచ్చిరాజు), డాక్టర్‌ సామల సదాశివ స్మారక పురస్కారం (తుమ్మూరి రామ్మోహన్‌రావు), మాలతీచందూర్‌ పురస్కారం (శివరాజు సుబ్బలక్ష్మి), ఇస్మాయిల్ సాహిత్య పురస్కారం (బొల్లోజు బాబా), అజోవిభో కందాళం ఫౌండేషన్ సాహిత్య పురస్కారాలు (ఎంవిఆర్ శాస్త్రి, జగద్ధాత్రి), వాసిరెడ్డి సీతాదేవి పురస్కారం (కుప్పిలి పద్మ), ఆవంత్స సోమసుందర్ స్మారక పురస్కారం (నందిని సిద్ధారెడ్డి, చాగంటి తులసి), రంగినేని బాల సాహిత్య పురస్కారం (నారంశెట్టి ఉమామహేశ్వరరావు) మొదలైన వారు పొందారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించే కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం రావులపాటి సీతారామ్‌కు దక్కగా, దాశరథి పురస్కారం ఎన్ గోపీ గారిని వరించింది. 


పలు సాహిత్య ఉత్సవాలు..!
2017 సంవత్సరాన్ని ప్రముఖ రచయిత, గోల్కొండ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించిన దేవులపల్లి రామానుజరావు, నాటి మహిళా రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ శతజయంతి సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇదే ఏడాది గురజాడ రచించిన 'కన్యాశుల్కం' నాటకం కూడా 125 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ ఉత్సవాలు విశాఖ, విజయనగరం నగరాలు కేంద్రంగా ఆంధ్రప్రభుత్వం, మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో జరిగాయి. 


అట్టహాసంగా తెలుగు మహాసభలు
ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగు మహాసభలు రంగరంగవైభవంగా జరిగాయి. దేశవిదేశాల నుండి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఎందరో అతిరథ మహారథులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తెలుగు భాషను పరిరక్షించడానికి వివిధ మార్గాలను సూచించారు. ఈ సభలో కవులు, కళాకారులు, రచయితలు, కార్టూనిస్టులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరవ్వడం విశేషం. 


2017, డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు జరిగిన ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి సారథ్యంలో ఎన్నికైన కోర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, కవి రచయిత దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.


ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పాటలు, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి ఆటలు, కలుపుపాటలకు ప్రాధాన్యం కల్పించారు. అయితే ఇవే సభలకు హాజరైన తెలుగు కార్టూనిస్టులను పోటీలు పెట్టిన తర్వాత పట్టించుకోకపోవడం.. కనీసం వారికి ఆహార సదుపాయాలు కూడా కల్పించకపోవడం వంటి పరిస్థితులు తలెత్తడంతో ఇదే వేడుకల్లో కొంత అపశ్రుతి చోటు చేసుకుందని పలువురి అభిప్రాయం. 


విషాద ఘడియలు
ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత సినారె మరణం తెలుగు సాహిత్యలోకాన్ని విషాదంలో ముంచెత్తింది. 'విశ్వంభర' వంటి అద్భుత కావ్యాన్ని తెలుగు ప్రజలకు అందించిన ఆ మేటి రచయిత ఈ సంవత్సరమే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అలాగే ప్రముఖ రచయితలు ఎం.వి.ఎస్ హరనాథరావు, కాకాని చక్రపాణి , ఇచ్ఛాపురం జగన్నాథరావు కూడా ఇదే సంవత్సరం పరమపదించడం విషాదమే. 
2018 సంవత్సరం తెలుగు సాహిత్య సౌరభాలను మరిన్ని వెదజల్లగలదని మనమూ ఆశిద్దాం..!