అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా... మందడం సమీపంలో పవన్‌కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించిన పోలీసులే .. కాన్వాయ్‌ ముందుకు వెళ్లకుండా తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక రైతులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు ,అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 200 మంది పోలీసులు కాన్వాయ్‌ ముందుకెళ్లకుండా చేయడంతో పవన్‌కళ్యాణ్ కారు దిగి కాలినడకన మందడం బయల్దేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్‌కళ్యాణ్ అభిమానులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.