అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన జనసేన పార్టీకి మరో షాక్ తప్పదా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలను, క్యాడర్‌ను కాపాడుకునేందుకు పవన్ కల్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు ఆ పార్టీ భవితవ్యంపై నమ్మకం లేని పార్టీని వీడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా ఆ పార్టీలో మరో కీలక నేతగా పేరున్న ఆకుల సత్యనారాయణ పార్టీని వీడే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. 


రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన ఆకుల సత్యనారాయణ ప్రస్తుతం తన రాజకీయ భవితవ్యంపై ప్రణాళికలు రచించుకుంటున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపి ఎమ్మెల్యేగా వున్న ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అప్పట్లో జనసేన పార్టీలో చేరారు. అలా బీజేపీతో వున్న అనుబంధం మేరకు తిరిగి ఆ పార్టీలోనే చేరాలని ఆకుల సత్యనారాయణ ప్లాన్ చేసుకుంటున్నారనేది ఆ వార్తాల సారాంశం.