తుపాను బాధితులకు విజయ్ దేవరకొండ ఉదారసాయం
శ్రీకాకుళం: తిత్లీ తుఫాను పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తిత్లీ సృష్టించిన ప్రళయానికి సిక్కోలు విలవిల్లాడిపోతోంది. కనీస సదుపాయాలు లేక జనాలు రోడ్డున పడ్డారు. కాగా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఓ వైపు నుంచి ప్రభుత్వ చర్యలు కొనసాగుతుంటే..మరోవైపు నుంచి స్వచ్ఛంధ సంస్థలు, సెలబ్రిటీలు బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ బాధితులకు ఆదుకునేందుకు ఏకంగా రూ. 5 లక్షలు విరాళం ఇచ్చి తనలోని ఉదారవాదాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షల విరాళాన్ని పంపించాడు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ ఫర్ చేసిన స్క్రీన్ షాట్ ను విజయ్ పోస్టు చేశాడు.
ట్విట్టర్ వేదికగా విజయదేవరకొండ మాట్లాడుతూ '' తుపాను బాధితులను ఆదుకునేందుకు చేతులు కలుపుదాం రండి... సాయం కోసం ప్రతి ఒక్కరూ కదలాలని విజ్ఞప్తి చేస్తున్నా... గతంలో కేరళ కోసం చేశాం... ఇప్పుడు మన శ్రీకాకుళం వాసులను ఆదుకుందాం పదండి. బాధితులకు నేను అండగా నిలబడతా. మీరు మీ వంతు సాయం అందించి సాయపడండి" అంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా అభిమానులకు పిలుపునిచ్చాడు.