జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన విజయవాడ పర్యటనలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాలలో తాను ఈనాటికీ కుల,మత, ప్రాంతీయ విద్వేషాలను చూస్తున్నానని.. ఏ ప్రభుత్వమైనా ముందు వాటికి అడ్డుకట్ట వేయాలని.. అప్పుడు ఎలాంటి రాజధానిని నిర్మించినా అది విశ్వనగరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వంగవీటి రంగా హత్య కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని.. ఆ తర్వాత జరిగిన గొడవల్లో ఎందరో అమాయకుల ప్రాణాలు పోయాయని ఆయన తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కులం కోసం జనాలు కొట్టుకొనేవరకూ.. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చూడలేమని పవన్ అభిప్రాయపడ్డారు. అర్థం లేని ఆవేశాలకు, అపార్థాలకు వెళ్లకుండా ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి.. కులమనే మహమ్మారిని పారద్రోలి.. కులతారతమ్యాలు ఎరుగని అమరావతిని చూడాలని కోరుకోవాలని అన్నారు. తెలంగాణలో కులమనే భావన లేదని.. అందరూ మన రాష్ట్రం.. మన తెలంగాణ అనే విధంగా మూకుమ్మడిగా ఉంటారని... అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఐక్యతకు పెద్దపీట వేయాలని పవన్ తెలిపారు.


అలాగే విద్యుత్ కార్మికుల సమస్యలపై స్పందిస్తూ "విద్యార్థులకు ఇచ్చినంత గట్టి హామీ నేను మీకు ఇవ్వలేను. ఎందుకంటే దాని పరిష్కారం నా చేతిలో లేదు. సమస్యను నేను ఎంత వరకు పరిష్కారం దిశగా తీసుకెళ్లగలనో అంత వరకు కృషి తప్పకుండా చేస్తాను" అని తెలిపారు పవన్ కళ్యాణ్.


అలాగే ఫాతిమా కాలేజీ విద్యార్థినుల సమస్యపై స్పందించిన పవన్ మాట్లాడుతూ "మీకు న్యాయం జరుగుతుంది. మీరు మళ్లీ కాలేజీలకు వెళతారు. జరిగిన విషయంలో విద్యార్థుల తప్పు ఇసుమంతైనా లేదు. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడతాను.వేల కోట్ల రూపాయలు ఒక్క సారిగా వ్యవస్థలోంచి తీసేయడానికి వీలు ఉన్నప్పుడు వంద మంది విద్యార్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఎందుకు ఉండదు. కాలేజీ యాజమాన్యం తప్పుకు విద్యార్థులను శిక్షించడం మంచిది కాదు. నేను బాధితుల తరఫున పోరాడతాను. ఇది చాలా తీవ్రమైన సమస్య " అని తెలియజేశారు.