Amaravati farmers meets Purandeswari : వైసీపి సర్కార్‌కి, చంద్రబాబుకు పురందేశ్వరి చురకలు
అమరావతి నుంచి ఏపీ రాజధానిని మరొక చోటుకు మార్చకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు నేడు బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని కలిశారు. తమ వ్యవసాయ భూములను వదులుకుని రాజధాని అభివృద్ధి కోసం ఇస్తే.. ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి మరొక చోటుకు తరలిస్తామంటే ఎలా అని అమరావతి రైతులు పురందేశ్వరి వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.
విజయవాడ: అమరావతి నుంచి ఏపీ రాజధానిని మరొక చోటుకు మార్చకుండా అడ్డుకుని.. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు కాకుండా చూడాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు (Amaravati farmers) నేడు బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని కలిశారు. తమ వ్యవసాయ భూములను వదులుకుని రాజధాని అభివృద్ధి కోసం ఇస్తే.. ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి మరొక చోటుకు తరలిస్తామంటే ఎలా అని అమరావతి రైతులు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు. రైతులతో సమావేశమైన అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను మొదటి నుంచి బీజేపీ సమర్దిస్తుందని అన్నారు. అయితే, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని.. రైతులు తమ భూములను ఇచ్చింది ప్రభుత్వం కోసమే కానీ పార్టీల కోసం కాదని అన్నారు. గతంలో కేంద్రం నిధులు ఇచ్చినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్‌కే పరిమితం అయ్యారని టీడీపీ పాలనపై మండిపడ్డారు.
Read also : జగన్‌కి జై కొట్టి.. పవన్ కల్యాణ్‌కి షాక్ ఇచ్చిన చిరంజీవి
మూడు రాజధానులపై బీజేపి వైఖరి గురించి..
జీఎన్ రావు కమిటీ నివేదిక ఇంకా బహిర్గతం అవలేదని.. ఆ నివేదిక బహిర్గతం అవ్వాల్సిన అవసరం ఉందని పురందేశ్వరి అన్నారు. క్యాబినెట్‌లో దీనిపై చర్చ జరగాలని.. వైసిపి సర్కార్ రైతులకు సమాధానం చెప్పిన తర్వాతే మూడు రాజధానులపై బీజేపీ స్పందిస్తుందని ఆమె స్పష్టంచేశారు. అప్పటి ప్రభుత్వంపై విశ్వాసంతో రైతులు భూములు ఇచ్చారు కనుక వారి ఆవేదనకు, ఆందోళనకు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
మంత్రి ప్రకటన సరైంది కాదు..
రాజధాని అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూములను వారికే తిరిగి ఇచ్చేస్తామని మంత్రి అనటం సరికాదని.. అలాంటి ప్రకటనలతో అక్కడి రైతులను అవమానించేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని పురందేశ్వరి హితవు పలికారు.
Read also : రాజధాని మూడు ముక్కలాట వెనుక వైసిపి ఇన్‌సైడ్ ట్రేడింగ్: జనసేన
గత ప్రభుత్వం కూడా అమరావతి రైతులకు సమాధానం చెప్పాలి..
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ. 2,500 కోట్ల నిధులు ఇచ్చినప్పటికీ... అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం గ్రాఫిక్స్‌తోనే ఐదేళ్లు కాలం గడిపిందని ఆమె ఆరోపించారు. అందుకే గత ప్రభుత్వం కూడా అమరావతి రైతులకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.