తాడేపల్లి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం ముగింపు వ్యవహారం అనేది ఒక విధానపరమైన నిర్ణయమని.. దానిని రాద్దాంతం చేసి రాజకీయం చేయడం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించుకుంటే ప్రజాస్వామ్యం కూలిపోతుందని.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కనుకే అటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అంబటి రాంబాబు స్పష్టంచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ పదవీకాలం ముగిసిందని ఆయన్ని ఆ పదని నుంచి తొలగిస్తూ ఏపీ సర్కార్ నుండి వెలువడిన ఉత్తర్వులపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. శుక్రవారం రాత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని అంబటి విస్మయం వ్యక్తంచేశారు. చంద్రబాబు బాధంతా తన మనిషి ఆ పదవిలోంచి పోతున్నాడనే కదా అని అన్నారు. 


రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సర్కార్ తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, ఎన్నికల సంస్కరణలపై టీడీపీ, బీజేపి నేతలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారని నిలదీశారు. 243కె నిబంధన ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారని గుర్తుచేస్తూ.. తాజాగా ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్సును సైతం గవర్నర్ ఆమోదించారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజాస్వామికంగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందని.. వ్యవస్థను చక్కదిద్దడం కోసం సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై ఆరోపణలు, విమర్శలకు అర్థం లేదని అంబటి రాంబాబు ప్రతిపక్షాలకు హితలు పలికారు.