వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివ రావు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సాంబశివ రావు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఇన్‌చార్జీ డీజీపీగా సేవలు అందించి ఇటీవలే పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సాంబశివ రావు చేరికతో వైఎస్సార్సీపీకి అదనపు బలం వచ్చినట్లయిందని అభిప్రాయపడ్డారు. అచ్యుతాపురంలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా రాంబిల్లి మండలం హరిపురంలో ఉన్న జగన్‌ను కలిసిన సాంబశివ రావు ఆయనతో కాసేపు ముచ్చటించారు. గతంలో సాంబశివ రావు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గాను సేవలు అందించారు. 


ఒంగోలులో మిరియాల పాలెం సాంబశివ రావు స్వస్థలం కావడంతో ఆయన అక్కడి నుంచి రానున్న 2019 ఎన్నికల్లో వైఎస్సార్పీపీ తరపున పోటీ చేస్తారా అనే ఊహాగానాలు సైతం మొదలయ్యాయి. గతంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సైతం వైఎస్సార్సీపీలో చేరి 2014 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.