ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు(ఆగస్టు2) జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలుచేయనున్న నిరుద్యోగ భృతిపై విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల కల్పన, రుణమాఫీ తదితర అంశాలపై కూడా కేబినెట్ చర్చిస్తుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల ముసాయిదా విధానం, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుణమాఫీని డిసెంబర్‌లోగా పూర్తి


అటు రైతు రుణమాఫీని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఒక్కో రైతుకు రూ.లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు.. అధికారంలోకి రాగానే రూ.50 వేలలోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు. మిగిలిన బకాయిను 5 విడతల్లో మాఫీ చేయాలని నిర్ణయించగా.. ఇప్పటికి 3 విడతల రుణమాఫీ జరిగింది. నాలుగో విడత మాఫీకి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.4,100 కోట్లు కేటాయించారు. అయితే, వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ఐదో విడతను కూడా ఈ ఏడాది చివరిలోనే ఇచ్చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 10% వడ్డీతో కలిపి మాఫీని వర్తింపజేశారు.