ప్రభుత్వ ఉద్యోగాలకు కంపూటర్ నైపుణ్యం తప్పనిసరి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా చేపట్టే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దీన్ని ఒక అర్హతగా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ‘ఈ-ప్రగతి’పై ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ.. వారిలో సంతృప్తి పెంచేదిశగా ఈ-ప్రగతి వేదిక ఉపయోగపడాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైద్యరంగంలోని అన్నిసేవలను ఈ-ప్రగతికి అనుసంధానించి వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.‬ అన్ని ప్రభుత్వ శాఖలను డిసెంబర్ నాటికి ఈ-ప్రగతితో అనుసంధానించి యాప్ లను సిద్ధం చేయాలని సూచించారు. సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నెలకోసారి కెలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామన్నారు.


ఈ-ప్రగతిలో అక్టోబరు 18 నాటికి 87 సేవలు సిద్ధమవుతాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. అలాగే రెవెన్యూలో భూ సేవలను యాప్‌ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ-ప్రగతి అధికారులు చంద్రబాబుకి తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి ఈ యాప్ సిద్ధమవుతుందని అధికారులు వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 20వేలకు పైగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, విద్యా, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ చేసేందుకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీలను భర్తీ చేయనుండగా.. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.


వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు:


  • గ్రూప్-1 : 150 ఖాళీలు

  • గ్రూప్-2 : 250  ఖాళీలు

  • గ్రూప్-3 : 1,670  ఖాళీలు

  • డీఎస్సీ ద్వారా : 9,275  ఖాళీలు

  • పోలీస్ శాఖ : 3,000 ఖాళీలు

  • వైద్య శాఖ : 1,604  ఖాళీలు

  • ఇతర శాఖలు : 1,636 ఖాళీలు

  • పాలిటెక్నిక్ లెక్చరర్స్:  310 ఖాళీలు

  • జూనియర్ లెక్చరర్స్ (ఇంటర్మీడియేట్): 200 ఖాళీలు

  • ఏపీఆర్ఈఐ సొసైటీ: 10 ఖాళీలు

  • ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్:  5 ఖాళీలు

  • డిగ్రీ కళాశాల లెక్చరర్స్:  200 ఖాళీలు

  • సమాచార పౌర సంబంధాల శాఖ:  21 ఖాళీలు

  • డీపీఆర్‌వో: 4 ఖాళీలు

  • ఏపీఆర్‌వో:  12 ఖాళీలు

  • డీఈటీఈ: 5 ఖాళీలు