కడప జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
బద్వేలు పరిధిలోని అంబేడ్కర్- మార్క్స్ కాలనీలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో రెండువేల గుడిసెలు దగ్ధమయ్యాయి.
బద్వేలు పరిధిలోని అంబేడ్కర్- మార్క్స్ కాలనీలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో రెండువేల గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో ఎందరో పేదలు ప్రాణాలు రక్షించుకొనేందుకు తమ ఇళ్లూ, వాకిళ్లూ వదిలి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ తీగల రాపిడి వలనే అగ్నికీలలు వ్యాపించి.. అందులో కొన్ని గుడిసెలపై పడడం వల్లే ఇన్ని గుడిసెలు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు.
తొలుత మంటలను అదుపుచేయటానికి స్థానిక అగ్నిమాపక దళాల ద్వారా సిబ్బంది ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు నుంచి మరిన్ని అగ్నిమాపక దళాలను తెప్పించారు. స్థానిక ఎమ్మెల్యే జయరాములు, పురపాలిక ఛైర్మన్ పార్థసారధి, మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రెడ్డెప్ప పట్టణ ఎస్సై చలపతి ఘటనా స్థలికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం స్థానికులను దగ్గరలోని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. బద్వేలు అగ్ని ప్రమాదఘటన వినగానే ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లా కలెక్టరుకి ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు సహాయ సహాకారాలు అందివ్వాల్సిందిగా ఆదేశించారు.