'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఐతే  ప్రస్తుతం రంజాన్ నేపథ్యంలో... ముస్లింల కోసం ప్రత్యేక సడలింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంజాన్ మాసం.. ముస్లింలకు చాలా పవిత్రమైనది. ఐతే కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్నందున వారు ప్రార్థనలు చేసుకోవడానికి వీలు లేదు. అలాగే బయట ఎవరూ గుంపులుగా తిరిగే అవకాశం లేదు. కాబట్టి రంజాన్ ను ముస్లింలు ఆనందంగా జరుపుకునేందుకు ప్రత్యేకంగా లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 


మసీదుల్లో ప్రార్థనలు చేసే విషయంలో ఐదుగురి వరకు మినహాయింపు ఇచ్చింది ఏపీ సర్కారు. ఇమామ్, మౌజం కాకుండా మరో ముగ్గురికి ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఐతే రంజాన్ పండగకు ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరింది. మరోవైపు 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తామని, అవసరానికి సరిపడా మంచినీరు అందిస్తామని ప్రకటించింది. అంతే కాకుండా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు విక్రయించే షాపులకు ఉదయం 10 గంటల వరకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


ఇఫ్తార్ కు  అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్ షాపులకు అనుమతి మంజూరు చేసింది. ఆహారం అందించే దాతలకు ఉదయం 3 గంటల నుంచి ఉదయం 4 గంటల 30 నిముషాల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిముషాల వరకు అనుమతించనున్నారు. ఐతే కేవలం మూడు నుంచి నాలుగు  పాయింట్లను మాత్రమే గుర్తించి అక్కడే అనుమతిస్తారు. 


అలాగే ప్రత్యేకంగా హోటళ్లు గుర్తించి సెహ్రీ, ఇఫ్తార్ సమయాల్లో టేక్ అవే లకు అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు  క్వారంటైన్లలో ఉన్న ముస్లింలకు కూడా ఉదయం పండ్లు, డ్రై ఫ్రూట్ తోపాటు సాయంత్రం పౌష్టికాహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇమామ్ లు, మౌజంలకు ప్రత్యేక పాసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


అంతేకాకుండా అన్ని మసీదుల వద్ద కరోనా వైరస్ నియంత్రణలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు. సామాజిక దూరం పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..