అర్చకులకు శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్‌లోని అర్చకులకు ప్రభుత్వం శుభవార్తను అందించనుంది.
ఆంధ్ర ప్రదేశ్‌లోని అర్చకులకు ప్రభుత్వం శుభవార్తను అందించనుంది. వేతనపెంపు, వారసత్వ హక్కుకు సంబంధించిన జీఓ నెంబర్ 76 పై సానుకూల నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం అర్చకులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచి.. సుమారు 5 వేల మందికి వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1400 మంది అర్చకులకు రూ.5 వేల చొప్పున వేతనాలు ఇస్తున్నారు. అటు వారసత్వ అర్చకత్వంపై కూడా ఒక కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం సచివాలయంలో అర్చకుల సమస్యలపై ఉన్నతస్థాయి సమావేశం జరగగా.. అధికారులు, అర్చక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అర్చకుల వేతనం, వారసత్వ అర్చకత్వంపై చర్చ జరిగింది. ప్రభుత్వం ఆర్చకుల జీతాన్ని రూ.10 వేలకు పెంచి నేరుగా బ్యాంకు ఖాతాలో జీతాన్ని జమచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారసత్వ అర్చకత్వంపై ఓ కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.