AP Heavy Rains Alert: జూన్ 2 లోగా ఏపీలో నైరుతి రుతుపవనాలు, ఈసారి భారీ వర్షాలు
AP Heavy Rains Alert: ఊహించినట్టే అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తున్నాయి. ఈ నెల 31 నాటికి కేరళను తాకుతుండగా, 2వ తేదీన ఏపీలో ప్రవేశించనున్నాయి. ఫలితంగా జూన్ నెలలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains Alert: రైతన్నలకు శుభవార్త. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి సకాలంలో దేశమంతా విస్తరించి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఫలితంగా విత్తుకునేందుకు అవసరమైన వర్షాలతో రైతన్నకు మేలు జరగనుంది.
గత ఏడాది నైరుతి రుతుపవనాలు మిగిల్చిన చేదు అనుభవానికి భిన్నమైన పరిస్థితులు ఈసారి ఏర్పడ్డాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో మే 19వ తేదీనే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా కదులుతున్నాయి. ముందుగా ఊహించినట్టే మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి. అక్కడ్నించి దక్షిణ భారతదేశం మీదుగా ఉత్తరం వైపుకు పయనిస్తాయి. ఈసారి జూన్ 1-2 తేదీల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించనున్నాయి. ఒకవేళ ఏదైనా ఆలస్యం జరిగినా మరుసటి రోజు అంటే 2-3 తేదీలకు ఏపీలో వచ్చేస్తాయి. రెమాల్ తుపాను కూడా బంగ్లాదేశ్ వైపుకు మరలిపోవడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణం ఏర్పడింది.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ సకాలంలో ఏపీలో వస్తుండటం రైతన్నకు ప్రయోజనం చేకూర్చనుంది. గత ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్ అనుకున్నంతగా జరగలేదు. ఆశించినమేర వర్షపాతం లేకపోవడంతో అన్నదాతకు నష్టం ఏర్పడింది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి జూన్ నెల సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. కేవలం జూన్ నెల ఒక్కటే కాకుండా సెప్టెంబర్ వరకూ సాధారణం కంటే అధిక వర్షపాతం కురవనుందని అంచనా. ఈశాన్య భారతదేశంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. దక్షిణాదిన సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుంది. జూన్-సెప్టెంబర్ సరాసరి 87 శాతమైతే 107 శాతం దాటి వర్షపాతం నమోదు కావచ్చని తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో గత రెండ్రోజుల్నించి తీవ్రమైన పొడి వాతావరణంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. రోహిణి కార్తె కూడా ప్రారంభం కావడంతో వడగాల్పులు తీవ్రత పెరుగుతోంది. రానున్న మూడ్రోజులు 49 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కావచ్చనే అంచనా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరం జిల్లాలో 27, పార్వతీపురం మన్యం జిల్లాలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లాలో 18, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, కోనసీమ జిల్లాలో 7, కాకినాడ జిల్లాలలో 18, ఏలూరు జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి.
Also read: AP Elections Survey: ఏపీలో అధికారం ఎవరిది, జగన్‌కు క్లారిటీ వచ్చేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook