BJP`s stand on 3 capitals for AP : ఏపీకి మూడు రాజధానులపై బీజేపి వైఖరి ఇదే : కన్నా
దేశంలో అలజడి సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం నుంచి, ఏపీలోనూ చర్చనియాంశమైన మూడు రాజధానుల ప్రతిపాదన వరకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీజేపి వైఖరి ఏంటనే విషయాన్ని స్పష్టంచేస్తూ ఏపీ బీజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: దేశంలో అలజడి సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం (Citizenship amendment act 2019) నుంచి, ఏపీలోనూ చర్చనియాంశమైన మూడు రాజధానుల ప్రతిపాదన (3 Capitals for AP) వరకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీజేపి వైఖరి ఏంటనే విషయాన్ని స్పష్టంచేస్తూ ఏపీ బీజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో ఎన్డిఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని అనేక సమస్యలు పరిష్కరించారని.. ఆర్టికల్ 370, రామ మందిరం, ట్రిపుల్ తలాక్ బిల్లులు (Aticle 370, Ram temple, Triple talaq bills) తీసుకొచ్చినప్పుడు వీటిలో వివాదం చేయలేకపోయిన విపక్షాలు ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టంను రాజకీయం చేస్తున్నాయని అన్నారు. గతంలో అనేక పార్టీలు ఈ బిల్లు కావాలని కోరినవే అని గుర్తుచేస్తూ.. అదే బిల్లును తాజాగా ఎన్డిఏ సర్కార్ చట్టం చేస్తే మాత్రం ఆ చట్టంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపిలో కులం, కుటుంబం, అవినీతిపైనే ప్రాంతీయ పార్టీలు ఆధారపడ్డాయని అన్నారు. అమరావతిని (Amaravati capital city) ఆరోజు రాజధానిగా ఉంచాలని జగన్‌తో సహా అందరూ అంగీకరించారు. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు భూములు ఇచ్చారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారతుందనే విధానం జగన్ నాయకత్వంలోనే చూస్తున్నాం అని అన్నారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కన్నా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపై కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. ఇది రాష్ట్ర అభివృద్ధికి అంత మంచి పరిణామం కాదని అన్నారు. ఇలా అయితే పెట్టుబడిదారులు కూడా రారని.. ప్రభుత్వాధినేతలు మారితే విధానాలు మాత్రమే మారాలి కానీ రాజధాని కాదని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మేము కూడా చెబుతున్నాం కానీ ఇలా పరిపాలన వికేంద్రీకరణ కాదని బిజేపి చాలా సార్లు చెప్పిందని ఆయన గుర్తుచేశారు. హైకోర్టు కర్నూలులో ఉండాని కోరుతున్నాం. ఇదే బిజేపి నిర్ణయం.. మా పార్టీలో ఎవరు, ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత నిర్ణయం అవుతుంది అని కన్నా స్పష్టంచేశారు.
చంద్రబాబు కూడా ఇలా చేసే దెబ్బ తిన్నారు..
రైతులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను జి.యన్ రావు కమిటీ తీసుకోకుండానే ఒక్క వైసిపి అభిప్రాయం తీసుకుని అదే అందరి అభిప్రాయం అన్నట్టుగా జగన్ ఎలా చెబుతారని కన్నా ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా ఇలా చేసే దెబ్బ తిన్నారు. ఇప్పుడు జగన్ కూడా నియంతృత్వ పోకడలతో వెళ్లడాన్ని బిజేపి ఖండిస్తోందని చెబుతూ మూడు రాజధానులపై కన్నా తమ పార్టీ వైఖరిని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలను తమ సొంత జాగీరుల్లా వ్యవహరిస్తున్నాయి. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ముందు సమాధానం చెప్పాలి. వారి సంగతి తేల్చకుండా మీరు ముందుకు వెళ్లడం సరి కాదు అని కన్నా హితవు పలికారు.
రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి కనిపించడం లేదు..
విశాఖలో ఐటి హబ్‌లు, పరిశ్రమలు పెడితే మేము కూడా స్వాగతిస్తాం. ఈ సీఎం పాలన చూస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావన మాకు లేదు. 151సీట్లు పెట్టుకుని కూడా జగన్ అభద్రతా భావంతో ఉన్నారు. జగన్ వచ్చి ఆరు నెలలు అయినా ఇంకా ఇన్‌సైడ్ ట్రేడింగ్ అని చేతకాని మాటలు తగదు. చర్యలు తీసుకోవడంలో మీరు రాజీ పడ్డారా ? లేక మిమ్మల్ని ఎవరైనా ఆపారా ? చేతనైతే చర్యలు తీసుకోండి... చేత కాకుంటే మాట్లాడకండి. అవినీతి చేసిన వారిని పక్కన పెట్టి.. అమాయకులను ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు అని కన్నా వ్యాఖ్యానించారు. భూకబ్జాలను అడ్డుకున్న మా పార్టీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వైసిపి సర్కార్‌పై కన్నా ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతులతో కలిసి న్యాయ పోరాటం...
మూడు రాజధానుల అంశంపై క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తే.. అప్పుడు కచ్చితంగా రైతులతో కలిసి న్యాయ పోరాటం చేయడానికైనా మేము వెనుకాడమని కన్నా తేల్చిచెప్పారు. జగన్ ఏ అంశాన్ని అయినా కుల, మతాలతో ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారని.. కులాల పేరుతో ప్రజల సొమ్మును పంచి మళ్లీ అదే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని కన్నా మండిపడ్డారు. వైసిపి పరిస్థితి ఇలాగే ఉంటే రేపు ప్రజా కోర్టులో జగన్‌కు ప్రజలే బుద్ది చెబుతారని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.