మార్చి 8, 2018 తేదిన ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రవేశపెడతారని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంత అధ్యయనం చేసి ఈ సంవత్సర బడ్జెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే గ్రామీణరంగంలోని ఆర్థిక వ్యవస్థ బాగా వృద్ధి చెందాలని.. తద్వారా పల్లెల్లో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్న క్రమంలో బడ్జెట్ కేటాయింపులు ఈ రంగానికి బాగానే అవకాశం ఉందనేది సమాచారం. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా రైతు రథం పథకం ద్వారా ట్రాక్టర్ల పంపిణీ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.  షెడ్యూలు కులాలకు సంబంధించి భూమి కొనుగోళ్లు చేయాలని ఇప్పటికీ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో.. ఈ అంశాన్ని కూడా బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ ఉంది. ఈ విషయంపై ఆర్థిక మంత్రి ఏం చెబుతారో కూడా వేచి చూడాలి.


అలాగే రొయ్యల చెరువులను జోన్లుగా విభజించాలని భావిస్తున్న క్రమంలో.. ఈ అంశంపై కూడా ఏదో ఒక విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పే అవకాశం ఉంది ఇక, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే.. ఈ బడ్జెట్‌లో దీనికి అదనపు నిధులు కేటాయించే అవకాశం ఉందనేది సమాచారం. అలాగే కొందరు ఆర్థిక నిపుణుల అంచనా మేరకు ఈ సారి బడ్జెట్‌లో పరిశ్రమలు, గనులకు రూ.4 వేల కోట్లకు పైగానే అందించే అవకాశం ఉంది. అలాగే రవాణా శాఖకు రూ.5 నుండి 6 వేల కోట్లకు పైగానే అందించే అవకాశం ఉందని పలువురు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.


ముఖ్యంగా సాగునీటి రంగానికి పెద్దపీట వేయాలని పలుమార్లు ప్రభుత్వం తెలిపింది కాబట్టి.. దాదాపు రూ.15 వేల కోట్ల అందించే అవకాశం ఉందనేది మరో అంచనా. అలాగే విద్యుత్ రంగానికి రూ.6వేల కోట్లు, వ్యవసాయ రంగానికి  రూ.10 వేల కోట్లు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్య శ్రీ పథకానికి గత బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సంవత్సరం ఆ మొత్తాన్ని పెంచే అవకాశం కూడా ఉంది . షాదీఖానాలకు గతంలో రూ.1500 కోట్లు కేటాయించారు. ఈ సారి అది తగ్గే అవకాశం ఉంది అలాగే పర్యావరణ శాఖకే గతంలో రూ.4 వేల కోట్ల పైమాటే కేటాయించారు. అది పెరిగే అవకాశం ఉంది. 


అలాగే సాంస్కృతిక శాఖకు గతంలో 78 కోట్లే ప్రకటించింది ప్రభుత్వం. ఆ మొత్తం ఏమైనా పెంచే అవకాశం ఉందేమో చూడాలి. అలాగే బీసీ సంక్షేమానికి, ఎస్టీ, ఎస్సీల సంక్షేమానికి, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ సంక్షేమానికి కూడా బడ్జెట్‌లో కాస్త పెద్దపీట వేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ క్యాంటీన్ల పథకానికి రూ. 200 కోట్లు గతంలో కేటాయించిన ప్రభుత్వం..వేరే కొత్త పథకాలు కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక హోంశాఖకు గతంలో రూ.5000 కోట్లకు పైగానే ప్రకటించిన ప్రభుత్వం దీనికి కేటాయింపుల్లో ఓ పది శాతం పెంచే అవకాశం ఉంది. అలాగే రోడ్లు, భవనాల శాఖకు గతంలో రూ.4000 కోట్లకు పైగా ప్రకటించిన ప్రభుత్వం ఎంత పెంచుతుందో చెప్పలేమని అంటున్నారు పలువురు నిపుణులు.


ఇక స్కిల్ డెవలప్ మెంట్, డ్వాక్రా రుణాలు, పెన్షన్లు, ఎల్‌పీజీ కనెక్షన్లు, గ్రామీణ రహదారులు, నిరుద్యోగ భృతి, శాప్‌.. వీటన్నింటినీ కూడా గతంతో పోల్చుకుంటే నేటి మార్కెట్‌ని బట్టి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఇక రాజధాని అభివృద్ధి మొదలైన విషయాలకు వస్తే...గతంలోనే అమరావతి అభివృద్ధి కోసం రూ. 1,061 కోట్లు కేటాయించింది. ఆ మొత్తం ఎంత వరకు పెరుగుతుందనేది వేచి చూడాలి. 


అటవీ శాఖకు గతంలో దాదాపు రూ.300 కోట్ల రూపాయలే ప్రకటించిన ప్రభుత్వం ఈసారి ఏమైనా కరుణిస్తుందేమో చూడాలి. అలాగే గతంలో మత్స్యశాఖకు కూడా దాదాపు అంతే మొత్తం కేటాయించింది. కాకపోతే పశుగణాభివృద్ధికి గత సంవత్సరం రూ.1000 కోట్లు ప్రకటించడం విశేషం. ఈసారి ఇందులో మార్పు ఏదైనా జరగవచ్చు. పండ్ల తోటల పెంపకానికి, రహదారుల నిర్వహణకు కూడా గత సంవత్సరం రెండింటికీ దాదాపు రూ.1000 కోట్లు కేటాయించారు. ఈ సారి తగ్గే అవకాశం ఉండవచ్చు అని పలువురు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమానికి గత సంవత్సరం రూ.89 కోట్లు కేటాయించారు. ఈ సారి ఈ మొత్తం పెంచే అవకాశం ఉంటే బాగుంటుంది అనేది పలు స్వచ్ఛంద సంస్థల అభిప్రాయం. 


గత సంవత్సరం ఏపీ బడ్జెట్ రూ.లక్షా 56వేల 999 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ. లక్షా 25 వేల 912 కోట్లుగా పేర్కొన్నారు. క్యాపిటల్ వ్యయం రూ.31,087 కోట్లు కాగా, ఆర్థికలోటును  రూ. 23,054 కోట్లుగా, రెవెన్యూలోటును రూ. 416 కోట్లుగా పేర్కొన్నారు. ఈ సారి ఈ మొత్తాలు ఎంత పెరగనున్నాయో.. ఎంత తగ్గనున్నాయో తెలుసుకోవాలంటే మార్చి 8వ తేది వరకు వేచి చూడాల్సిందే


జీన్యూస్ ప్రజావేదిక ద్వారా మీరు కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎలా ఉండాలని భావిస్తున్నారో.. ఎలాంటి కేటాయింపులు జరగాలని కోరుకుంటున్నారో మాకు తెలపాలంటే, జీ న్యూస్ ఫేస్బుక్ పేజీలోని కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాలు తెలపండి