గవర్నర్ నరసింహన్ పై చంద్రబాబు డైరెక్ట్ ఎటాక్
చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సారి ఏకంగా గవర్నర్‌నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆయన తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ...మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు .ఈ సందర్భంగా చంద్రబాబు గవర్నర్ నరసింహన్ తీరును తప్పుబట్టారు... టీడీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను గవర్నరే కలుపుతున్నారని వార్తలు వస్తున్నాయని.. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం.. రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని హితవు పలికారు.
ఇది మోడీ సర్కార్ కుట్ర
టీడీపీకి ఏకాకి చేయాలని కేంద్రం కుట్ర చేస్తుందని..అందుకు గవర్నర్‌ను పావుగా వాడుకుంటోందని విమర్శించారు. ఇటు వైసీపీని కేంద్ర ప్రభుత్వమే రెచ్చగొడుతోందని చంద్రబాబు విమర్శించారు. మొన్నటిదాకా తమతో ఉన్న పవన్.. ఇప్పుడు విమర్శలు మొదలెట్టారని.. ఇదంతా మోడీ సర్కార్ ఆడిస్తున్న డ్రామా అని . ఏపీకి అన్యాయం చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలకు ప్రజలే రక్షణ వలయంగా నిలవాలని పిలుపునిచ్చారు. అందరూ ఐక్యమైతే కేంద్రం కుట్రలను ఐక్యంగా భగ్నం చేయవచ్చని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలనూ టీడీపీ గెలుచుకుంటే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు రాబట్టవచ్చని చంద్రబాబు వెల్లడించారు.