సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు తాను మొన్నటి వరకు చాలా బాగానే కనపడ్డానని, ఇప్పుడేమో ఆయన కూడా తనని విమర్శిస్తున్నారని చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. శనివారం కర్నూలులో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు చంద్రబాబు మంచోడేనని చెప్పిన పవన్ కల్యాన్‌కి ఇప్పుడు ఉన్నట్టుండి తాను బాగా కనిపించడం లేదు ఎందుకోనని చంద్రబాబు సందేహం వ్యక్తంచేశారు. రాజకీయాలు తెలియని వ్యక్తులు, కేసుల్లో ఉన్న వ్యక్తులు ఎంతో చరిత్ర, అనుభవం ఉన్న టీడీపీని విమర్శిస్తున్నారని తనని విమర్శిస్తోన్న నేతలపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. 


టీడీపీని విమర్శించే హక్కు ఎవరికి లేదన్న చంద్రబాబు.. ఆంద్రాలోని ఐదు కోట్ల మంది ప్రజలే తమకు  హైకమాండ్‌ అని అన్నారు. టీడీపీని ఓడించడం ఎవరితరం కాదని పార్టీ శ్రేణులకు చెబుతూ.. ఏపీలోని 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపించాల్సిన అవసరముందని తెలుగు తమ్ముళ్లకు గుర్తుచేశారు. 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే మనమే ప్రధానిని నిర్ణయించే వాళ్లం అవుతామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తంచేశారు.