చంద్రబాబుని అసంతృప్తికి గురిచేసిన అరుణ్ జైట్లీ సమాధానం!
అరుణ్ జైట్లీ స్పందనపై ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి
రాజ్యసభలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. "ఏపీకి ఇవ్వాల్సినవి ఇచ్చేశాం. కేవలం ప్రత్యేక ప్యాకేజీ, రెవిన్యూ లోటు పూడ్చడం తప్ప" అని వ్యాఖ్యానించడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు పార్టీ నేతలని అడిగి తెలుసుకోవడమేకాకుండా ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై వారికి సూచనలు ఇస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం సైతం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో ఏపీ గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేసే వరకు నిరసనలు ఆపకూడదు అని పార్టీ నేతలకు మొదటి నుంచి చెబుతూ వస్తోన్న చంద్రబాబు.. చివరకు జైట్లీ స్పందించిన తీరు చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఎలాగూ కేంద్రం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు కనుక శుక్రవారం కూడా సమావేశాలు జరిగే సమయంలో ఉభయ సభల్లో నిరసనలు కొనసాగించాలని టీడీపీ ఎంపీలకి సూచించినట్టు సమాచారం.