అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీకి లక్ష్మీపార్వతి అందిస్తున్న సేవలకు గాను ఆమెకు ఈ పదవి దక్కిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆ పార్టీపైనా.. పార్టీ అధినేత చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేయడంలో లక్ష్మీపార్వతి ఎప్పుడూ వెనుకడుగేయలేదు. అంతేకాకుండా టీడీపీని విమర్శిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన అన్ని నిరసన కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొని పార్టీ కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించేవారు. 


ఇదిలావుంటే, ఇప్పటికే వైసిపి మహిళా నేతల్లో ముఖ్యులైన రోజాను ఏపీఐఐసి చైర్మన్‌గా, వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.