Alluri Jayanthi: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు మెగాస్టార్ చిరుకు ప్రత్యేక ఆహ్వానం చర్చనీయాంశమవుతోంది. చిరుకు అరుదైన గౌరవం వెనుకు ఏపీ సీఎంవో కార్యాలయం ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. చిరుకు..ఏపీ ప్రభుత్వం అంతటి ప్రాధాన్యత వెనుక రాజకీయ కారణాలున్నాయని సమాచారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గుర్తింపు లభించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో వేదిక పంచుకునే అద్భుత గౌరవం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా..మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్ని భీమవరంలో అత్యంత ఘనంగా జరపనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. జూలై 4వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి..ప్రధాని మోదీతో వేదిక పంచుకునే అరుదైన గౌరవాన్ని అందిస్తూ..కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆహ్వానం పంపించారు.


ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు, కేంద్రంలో అధికార బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కూడా పార్టీ తరపు ప్రతినిధి పంపించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఏ పార్టీకు ప్రాతినిధ్యం వహించని..మెగాస్టార్ చిరుకు మాత్రం స్వయంగా కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పంపించడం వెనుక ఉన్న కారణాలు..కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర సాంస్కృతిక శాఖ ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదనేది మింగుడుపడటం లేదు. పార్టీ తరపున ప్రతినిధిని పంపించాలని మాత్రమే ఆహ్వానం పంపించారు. 


చిరుకు ప్రత్యేక ఆహ్వానం వెనుక ఏపీ సీఎంవో


చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపించడం వెనుక ఏపీ సీఎంవో కార్యాలయం ప్రమేయముందనే వార్తలు వస్తున్నాయి. సినిమా టికెట్ల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం మెగాస్టార్ చిరుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి..అతనిని పెద్దమనిషిగా గుర్తిస్తూ చర్చలు జరపడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలకు కూడా చిరుకు ప్రత్యేక ఆహ్వానం..ఏపీ సీఎంవో కార్యాలయం ప్రమేయంతోనే జరిగిందని తెలుస్తోంది. 


కాపు సామాజికవర్గమే లక్ష్యమా


జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రాజకీయంగా ఉన్న వైరుద్యం, బలమైన సామాజికవర్గ ప్రభావం చిరంజీవి, ఏపీ ప్రభుత్వం మధ్య సాన్నిహత్యాన్ని పెంచుతున్నాయి. కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవికి ఇప్పటికీ రాష్ట్రంలో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ వెనుకున్న కాపు సామాజికవర్గాన్ని..చిరంజీవి అనే అస్త్రం ద్వారా తమవైపు తిప్పుకోవాలనేది రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. అందుకే చిరంజీవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు అల్లురి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం పంపించి..ఆయనకు మరింత గుర్తింపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న జనసేనను బీజేపీ గుర్తించడం లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. 


అదే సమయంలో చిరంజీవి సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల సానుకూల దృక్పధంతో ఉన్నట్టు సినిమా టికెట్ల విషయంలో జరిగిన చర్చల సందర్బంగా చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని,మాటతీరును చిరంజీవి ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. 


ఇదే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఇటీవల రాజమండ్రి, వరంగల్, హైదరాబాద్‌లో జరిగిన కార్కక్రమాలకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రోమో విడుదల చేయడమే కాకుండా..హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Also read: Chiru with PM Modi: ప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి