ఏపీ ఎంసెట్ ఫలితాలు: 72 శాతం మంది క్వాలిఫై, మే 26 నుంచి కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షలో 72.28 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం లక్షా 38 వేల 17 మంది అర్హత సాధించినట్లు మంత్రి చెప్పారు.
పరీక్ష రాసిన వారు లక్షా 90 వేల మంది అని తెలిపారు. ఎంసెట్ కీలో 124 ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, 1,26,197 మందికి ర్యాంకులను కేటాయించామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మే 26 నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు.
ఏపీ ఎంసెట్-2018లో ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్ భోగి సూరజ్ కృష్ణ సాధించగా, మెడిసిన్‌లో ఫస్ట్ ర్యాంక్ సాయి ప్రియ సాధించింది. ఇంజినీరింగ్ విభాగంలో రెండో ర్యాంక్ గట్టు మైత్రేయికి దక్కింది.
పిన్నమనేని లోకేశ్వర్ రెడ్డి మూడో ర్యాంకు లభించింది. మొత్తం లక్షా 90 వేల మంది ఎంసెట్ రాయగా 72.28 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్‌లో 72.28 శాతం మంది ఉత్తీర్ణులు కాగా మెడిసిన్‌లో 87.60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నంబర్లకు ర్యాంకులు మెసేజ్‌ల రూపంలో పంపిస్తారు. ఎంసెట్ ఫలితాలు టీవీ తెరపై ప్రత్యక్షం కానున్నాయి. ఏపీ ఫైబర్‌నెట్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలు విద్యార్థుల కోసం ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
ఫలితాలు విడుదలైన అనంతరం.. ఎంసెట్ రిజల్ట్స్ పేరుతో టీవీ తెరపై ప్రత్యేక సూచీ కనిపిస్తుంది. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్నవారు ఆ సూచీని ఎంపిక చేసుకొని హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.
ఈ ఎంసెట్ ఫలితాలను www.sche.ap.gov.in ; www.vidyavision.com ; www.manabadi.com ; www.manabadi.co.in; and www.schools9.com మొదలైన వెబ్ సైట్ల ద్వారా వీక్షించవచ్చు