రిటైరైన గంటల్లోనే చిక్కుల్లో భన్వర్లాల్
తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మంగళవారం రిటైరయ్యారు. ఆయన రిటైరైన కాసేపటికే ఏపీ ప్రభుత్వం.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1996లో భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. అప్పుడు ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లో కలెక్టర్ బంగ్లా కేటాయించారు. 2000లో భన్వర్‌లాల్ స్థానంలో కొత్త కలెక్టర్ వచ్చారు. లెక్కప్రకారం.. భన్వర్‌లాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి కొత్త అధికారికి అప్పగించాలి. కానీ భన్వర్లాల్ 2006 వరకు ఖాళీ చేయకుండా ఆ నివాసంలోనే ఉన్నారు.
ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. 70 నెలలపాటు అనధికారికంగా బంగ్లా వినియోగించినందుకు నెలకు 25 వేల రూపాయల చొప్పున మొత్తం 17.50 లక్షల రూపాయలు చెల్లించాలని 2005లో నోటీసు పంపింది. అయితే భన్వర్లాల్ అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం 2007లో ఆ మొత్తాన్ని 4.37 లక్షలకు కుదించి, ఆయన నెలవారీ జీతంలో 5 వేలు చొప్పున 88 నెలలపాటు వసూలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు విఫలమయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఆయన రిటైరైన కొద్ది గంటలకే క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.