Minister Roja:ఆర్కే రోజా... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్. ప్రస్తుతం ఏపీ మంత్రి. తన మాటలతో విపక్షాలను గడగడలిస్తారని రోజాకు పేరుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. నారా లోకేష్ ను ఆటాడుకున్నారు. అసెంబ్లీ నుంచి ఆమెను సస్పెండ్ కూడా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆమె దూకుడు తగ్గలేదు. జగన్ తొలి కేబినెట్ లో  చోటు దక్కనందుకు కొంత అసంతృప్తిగా ఫీలైనా.. చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేయడంలో మాత్రం ఆమె స్పీడ్ తగ్గించలేదు. అయితే విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడే ఆర్కే రోజాకు సొంత పార్టీ నుంచే కష్టాలు వస్తున్నాయని తెలుస్తోంది. నగరి నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా బలమైన వర్గం ఉంది. గతంలో ఆమెను ముప్పు తిప్పలు పెట్టారు. అయితే రోజా మంత్రి కావడంతో అంతా సర్దుకుంటుందని భావించారు. కాని రోజా మంత్రి అయినా ఆమె వ్యతిరేక వర్గం నేతలు మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన సొంత నియోజకవర్గమైన నగరిలో మంత్రి రోజాకు రోజురోజుకు అసమ్మతి సెగ పెరిగిపోతోంది. సీనియర్ నేత, శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్  రెడ్డివారి చక్రపాణిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్,  ఆయన భార్య ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి తదితరులతో రోజాకు  విభేదాలు మరింత ముదురుతున్నాయి. రోజాను పట్టించుకోకుండా వీళ్లు నగరి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసమ్మతి నేతలతో పలు సార్లు సీఎం జగన్ కు రోజా ఫిర్యాదు చేసినా వాళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. అసమ్మతి నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఉండటంతో ఎవరూ ఏమి చేయలేకపోతున్నారనే టాక్ ఉంది.తాజాగా మంత్రిగా ఉన్న రోజా.. సొంత పార్టీ నేతలపై ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. 


నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం ఈసలాపురం పరిధిలో ఉన్న కొత్త క్వారీల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. రోజాకు తెలియకుండానే ఆమెకు వ్యతిరేకంగా ఉండే నేతలే వీటిని ప్రారంభించారు. ఈసలాపురం గ్రామం సర్వే నంబరు 6లో 750 ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూములున్నాయి. ఇందులో  ఇప్పటికే నాలుగు క్వారీలు నడుస్తున్నాయి. కొత్తగా మరో ఐదు క్వారీల ఏర్పాటుకు దరఖాస్తులు వెళ్లాయి. మొత్తం పదెకరాలకు ఒక క్వారీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ అసమ్మతి నాయకులకు సీనియర్ మంత్రి అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.ఇదే రోజా ఆగ్రహానికి కారణమైంది. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా కొత్త క్వారీలకు ఎలా శ్రీకారం చుడతారని మంత్రి మండిపడుతున్నారు.


క్వారీల విషయంలో రోజా దూకుడుగా వెళుతున్నారు. ఆమె వర్గానికి చెందిన పుత్తూరు మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు  కొత్త క్వారీల ఏర్పాటును వ్యతిరేకించారు. మంత్రి రోజా కూడా క్వారీల విషయమై నేరుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా కొత్త క్వారీలను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఈసలాపురం గ్రామాన్ని పుత్తూరు మున్సిపాలిటీలో కలిపారని.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాయకుండా ఈసలాపురం పంచాయతీ కార్యదర్శి పేరిట ఎలా రాస్తారని కలెక్టర్ను రోజా నిలదీసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో క్వారీల రగడ నగరి నియోజకవర్గ వైసీపీలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న చర్చ సాగుతోంది.  


Also Read: Batasingaram Market: రైతన్నకు తీరని నష్టం.. బాటసింగారం మార్కెట్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన టన్నులకొద్ది పండ్లు...


Also Read: Srisailam Dam:జూలైలోనే నిండిన  శ్రీశైలం డ్యాం.. ఇవాళ   గేట్లు ఓపెన్.. పర్యాటకుల సందడి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook