AP Governor Speech: మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే ఏపీ గవర్నర్ ప్రసంగం, కారణాలేంటి
AP Governor Speech: ఏపీ కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్‌గా తొలి ప్రసంగం ఇచ్చారు. మూడేళ్లలో తొలిసారిగా మూడు రాజధానుల అంశం లేకుండా గవర్నర్ ప్రసంగం కొనసాగడం విశేషం. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.
AP Governor Speech: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీన్ తన తొలి ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఇప్పటి వరకూ ప్రతి గవర్నర్ ప్రసంగంలోనూ ఉన్న మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ ప్రస్తావన ఈసారి లేకపోవడం గమనార్హం.
ఏపీ కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం..
ఏపీలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటైందని చెప్పారు. కడపలో డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 80 లక్షలమంది పిల్లలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు.
రాష్ట్రం ఆర్ధికాభివృద్ధిలో ముందంజలో ఉందని..వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పధకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అవినీతికి అవకాశం లేకుండా లబ్దిదారులకే నేరుగా లబ్ది అందుతోందన్నారు. రాష్ట్రంలో వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన లబ్దిదారులకు ఇంటికే సంక్షేమ పథకాలు ఇస్తున్నామని, నాడు-నేడు పథకంతో విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు.
మూడు రాజధానుల అంశం లేకుండా గవర్నర్ ప్రసంగం
రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం, విడుదల చేసిన నిధులు, అభివృద్ధి పనులు, కళాశాలల నిర్మాణం, విద్యారంగంలో సంస్కరణలు, గ్రోత్ రేట్, బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు సహా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు గురించి కూడా గవర్నల్ ప్రసంగంలో ప్రస్తావన ఉంది. కానీ మూడేళ్లుగా ప్రతి గవర్నర్ ప్రసంగంలో తప్పనిసరిగా విన్పించిన మూడు రాజధానుల అంశం, పరిపాలనా వికేంద్రీకరణ అంశాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతానని..అక్కడి నుంచే పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న నేపధ్యంలో గవర్నర్ ప్రసంగంలో ఆ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
మూడు రాజధానుల అంశం లేకపోవడానికి కారణమేంటి
ఏపీ మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండటమే కాకుండా అదే సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా చేసిన అబ్దుల్ నజీర్ గవర్నర్ కావడం వల్లనే ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రసంగం నుంచి తప్పించిందా అనే సందేహాలు వస్తున్నాయి. అటు టీడీపీ కూడా ప్రభుత్వం గవర్నర్ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రసంగంలో ఆ ప్రస్తావన లేకుండా వెనక్కి తగ్గిందని వ్యాఖ్యానిస్తోంది. ఎందుకంటే సాధారణంగా గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వమే తయారు చేసిస్తుంది. అందుకే ప్రసంగం నుంచి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తప్పించి ఉంటుందని తెలుస్తోంది. లేదా గవర్నర్ సూచన మేరకే ఆ అంశాన్ని తొలగించారా అనే చర్చ కూడా వస్తోంది.
Also read: AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు, 16నే రాష్ట్ర బడ్జెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook