అనంతపురం: ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఘోరపరాజయం పాలయ్యారు. రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వున్న రఘువీరా రెడ్డి పోటీచేసిన కళ్యాణదుర్గం స్థానంలో ఆయనకు కేవలం 28,662 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే, ప్రత్యేకహోదా ఫైలుపైనే తొలి సంతకం చేస్తామని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రాణం పోసుకుంటుందని ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లుజల్లుతూ ఏకంగా పార్టీ చీఫ్ రఘువీరా రెడ్డి సైతం మూడో స్థానంలోనే సరిపెట్టుకునేలా ఓటర్లు తీర్పునిచ్చారు. ఇది ఒక విధంగా రఘువీరా రెడ్డికి చేదు అనుభవమే అవుతుందని అంటున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణమని భావించిన ఏపీ ఓటర్లు ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. అయితే, రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో ఈసారి పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు ఆశించినప్పటికీ.. అలా ఏం జరగలేదని నిన్న వెల్లడయిన ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. 


ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్‌ శైలజానాథ్‌‌‌కి శింగనమల నియోజకవర్గంలో కేవలం 1325 ఓట్లు మాత్రమే రావడం అందుకు ఓ నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇంకొంత మంది ముఖ్యనేతలకు సైతం 2014 ఎన్నికల్లో లభించిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లే రావడం గమనార్హం.