ఏపీలోని డిగ్రీ కళాశాలలకు సంబంధించి అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల్లోని అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలకు అవసరమైన అర్హత పరీక్ష ఏపీసెట్ - 2018 (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు)ను జులై 1వ తేదిన నిర్వహించనున్నారు. ఈ సారి ఈ పరీక్షను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఉప కులపతి ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 18వ తేదిన ఏపీ సెట్ 2018 నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ పరీక్షలో బోధనతో పాటు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలకు 100 మార్కులు, అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులోని ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. నెగటివ్ మార్కులు లేకుండా నిర్వహించే ఈ పరీక్షలకు దరఖాస్తులను మార్చి 26 నుంచి మే 2వ తేది వరకు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు.


విశాఖపట్నంతో పాటు రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ఏపీ సెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సెట్ కన్వీనర్ తెలిపారు. యూజీసీ - సీఎస్‌ఐఆర్ సిలబస్‌తో పాటు నెట్ సిలబస్‌ను కూడా ఈ టెస్టు కోసం ప్రిపేరయ్యే అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది. జులై 1, 2018 తేదిన ఏపీ సెట్ నిర్దేశిత పరీక్షా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఏపీసెట్‌కు సంబంధించి అదనపు సమాచారం కోసం www.andhrauniversity.edu.in లేదా www.apset.net.in వెబ్‌సైట్లను సందర్శించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 0891-2730148, 2730147 నెంబర్లలో కూడా సంప్రదించవచ్చు.