నేడు ఏపీ టెట్ 2018 ఫలితాలు
ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.
ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. అనుకున్న షెడ్యూల్ మేరకు టెట్ ఫలితాలను జూన్ 30న విడుదల చేయాల్సి ఉన్నా..సాంకేతిక కారణాలతో రెండు రోజులు ఆలస్యమయ్యింది. జూన్ 10 నుంచి 19 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈసారి టెట్ పరీక్ష రాసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై ఫలితాలు కనిపించాయి. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,576 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఇప్పటికే డీఎస్సీ షెడ్యూల్‌ను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జులై 6న జారీ కానుంది. దీనిద్వారా ఏపీలోని మొత్తం 10,351 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.జులై 7 నుంచి ఆగస్టు 9వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 23 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. సెప్టెంబర్ 10న డీఎస్సీ ఫైనల్ 'కీ', సెప్టెంబర్ 15న ఫలితాలను విడుదల చేయనున్నారు. పీఈటీ, డాన్స్, మ్యూజిక్ మినహా మిగతా అన్ని విభాగాలకు సంబంధించి డీఎస్సీ సిలబస్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.