ఆహా వేదికగా ప్రసారమైన అన్‌స్టాపబుల్ 2 షో రాజకీయంగా చర్చనీయాంశమౌతోంది. ఎన్టీఆర్ లెగెసీ తెలుగుదేశం పార్టీకు ఎంత అవసరమో ఈ షో చెప్పకనే చెబుతోంది. అందుకే అన్‌స్టాపబుల్ అబద్ధాలు కొనసాగాయనే విమర్శ విన్పిస్తోంది. అంతా తెలిసిన బాలకృష్ణ అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పారనే విమర్శ వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1995 సంఘటన నిజానికి ఇప్పుడున్న అప్పటితరమంతటికీ తెలుసు. నాడు ఏం జరిగింది, ఎవరెవరి ప్రమేయముంది, ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, నందమూరి కుటుంబంలో ఎవరు ఎప్పుడు ఏమన్నారో అందరికీ తెలిసిందే. ఇదంతా చెరిపేస్తే చెరగని చరిత్ర. ఇందుకు సాక్ష్యంగా చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి రాసిన పుస్తకముంది, పురంధరేశ్వరి నాటి సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడిన అంశాలున్నాయి.


అన్‌స్టాపబుల్ 2లో బాలకృష్ణ ఏం చెప్పారు


1995లో జరిగిన ఘటనకు నందమూరి కుటుంబం,టీడీపీ ఆమోదం ఉందని పార్టీ సభ్యుడిగా, నందమూరి కుటుంబ సభ్యుడిగా చెబుతున్నానని బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో 2లో చెప్పారు. అందరి ఆమోదంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని బాలకృష్ణ చెప్పినా ఇదంతా నిజం కాదనే వాదన విన్పిస్తోంది. అంతా తెలిసిన బాలకృష్ణ ఇప్పుడు బావ చంద్రబాబు సమక్షంలో అబద్ధాలు చెప్పడం సమంజసమేనా అన్పిస్తోంది. 
 
అసలు ఆ రోజు ఏం జరిగింది


చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలో వివరాలు, ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది సీనియర్ జర్నలిస్టులతో చేసిన వ్యాఖ్యల ప్రకారం ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం..


నిజానికి ఆ రోజు బాలకృష్ణ చెప్పినట్టుగా నందమూరి కుటుంబం మద్దతు మొత్తం చంద్రబాబు వెంట లేదు. ఆ రోజు చంద్రబాబు వెంట ఉన్నది బాలకృష్ణ, హరికృష్ణ, రామకృష్ణతో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. మిగిలిన ఆరుగురు సంతానం చంద్రబాబు వెంట లేరు. మరో ఇద్దరు కుమారులైతే ఎన్టీఆర్ వెంటే ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో..సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌తో చేసిన వ్యాఖ్యలు కూడా నందమూరి కుటుంబం మద్దతు ఎంతవరకూ ఉందనేది చెబుతోంది. ఆ రోజు తాను స్వయంగా తన భర్త దగ్గుపాటిని వారించారని..నాన్నకు అన్యాయం చేయవద్దని వేడుకున్నా..ఆయన వినలేదని భర్త సమక్షంలోనే ఆమె చెప్పారు.  


దగ్గుపాటి పుస్తకంలో ఏముంది


1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన తరువాత చంద్రబాబును తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ నేతగా ఎన్నుకునే రోజు ఉదయం తెల్లవారజామున వైశ్రాయి హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ గదిలో ఉన్న చంద్రబాబు ఇతర పార్టీ నేతల వద్దకు బాలకృష్ణ వెళ్లారు. మనం పెట్టిన షరతులు ఒప్పుకునేందుకు నాన్న అంగీకరించారని..ముఖ్యమంత్రి పదవి నుంచి దించవద్దని బాలకృష్ణ స్వయంగా కోరగా..చంద్రబాబు ఇతర పార్టీ నేతలు ససేమిరా అన్నారు. ఈ విషయం తనకు తెలియకుండా చేశారని దగ్గుపాటి పుస్తకంలో రాశారు. 


కాళ్ళు పట్టుకుని వేడుకోవడం నిజమేనా


అన్‌స్టాపబుల్ 2లో నాటి ఘటన గురించి మాట్లాడుతూ..ఆ రోజు ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఒప్పుకోలేదని..మరోమార్గం లేకనే అలా చేయాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆ సమయంలో ఆ గదిలో చంద్రబాబు, ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు. అంటే గదిలో నిజానికి ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. చంద్రబాబు బయటికొచ్చి చెప్పింది బాలకృష్ణ సహా అందరూ నమ్మాల్సిన పరిస్థితి.


1995 ఘటనకు ప్రజల మద్దతు ఉందా


అన్‌స్టాపబుల్ 2లో ఆ రోజు మనం చేసిందా తప్పా అని చంద్రబాబు అడిగినప్పుడు..కానేకాదని..ఆ విషయం తరువాత జరిగిన ఎన్నికల్లో రుజువైందని బాలకృష్ణ సమర్ధించుకుంటూ మాట్లాడారు. నిజానికి 1995 ఘటన తరువాత వెంటనే జరిగిన ఎన్నికలు 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలు. అంటే చంద్రబాబు ఎదుర్కొన్న తొలి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు లోక్‌సభ పరిధిలోని 94 అసెంబ్లీ స్థానాల్లోనే ఆధిక్యం లభించింది. 1994 ఎన్నికలతో పోలిస్తే 100కు పైగా సీట్లలో టీడీపీ ఆధిక్యం కోల్పోయినట్టే లెక్కలు చెబుతున్నాయి. 


ఇక 1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఆ సమయంలో దేశమంతా వాజ్‌పేయి ప్రభావంతో పాటు మరీ ముఖ్యంగా కార్గిల్ యుద్ధ ప్రభావం స్పష్టంగా ఉంది. కార్గిల్ యుద్ధం దేశ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించిందో అందరికీ తెలుసు. 


వాస్తవాలు ఇలా కళ్లముందుంటే..అన్‌స్టాపబుల్ 2లో అన్ని అబద్ధాలు ఎలా చెప్పగలిగారనే విమర్శలు వెల్లువెత్తుుతున్నాయి. అన్‌స్టాపబుల్ అబద్ధాల వెనుక మర్మం..ఇప్పుడు టీడీపీకు ఎన్టీఆర్ లెగెసీ అవసరం రావడమేనని తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ చంద్రబాబు చెప్పినట్టు ఆయన గుండెల్లో ఉంటే..1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీకు ఎన్టీఆర్ అవసరం ఇక లేదని ఎందుకు చెప్పారో బాలకృష్ణ సమాధానం చెప్పాలని రాజకీయయ విమర్శకులు కోరుతున్నారు. 


Also read: Munugodu Bypoll: మునుగోడు టు ఏపీ బీజేపీ, కొత్త పొత్తు టీడీపీకు వర్కవుట్ అవుతుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook